ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రాట్యుటీ ఎలా లెక్కిస్తారో తెలుసా? 5,7,10 ఏళ్ల సర్వీసుపై రూ. 30 వేల జీతంపై ఎంతొస్తుందో లెక్కలివే.

business |  Suryaa Desk  | Published : Mon, Jan 13, 2025, 11:40 PM

మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా. అయితే ఈపీఎఫ్ నుంచి ఎన్నో బెనిఫిట్స్ పొందుతుంటారు. ఇక్కడ నెలనెలా జీతం నుంచి కట్ అయి పీఎఫ్ అకౌంట్లో పడుతుంది. దీంట్లో డబ్బుల్ని పాక్షికంగా కొన్ని అవసరాల మేరకు తీసుకోవచ్చు. రిటైర్మెంట్ తర్వాత పూర్తిగా తీసుకోవచ్చు. ఇంకా పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి రిటైర్మెంట్ తర్వాత.. సర్వీసును బట్టి ఈపీఎస్ పెన్షన్ కూడా అందుతుంది. అయితే ఇదే సమయంలో ఉద్యోగులకు అందేటువంటి మరో గొప్ప ప్రయోజనం గ్రాట్యుటీ. అవును సంస్థలో కనీసం 5 సంవత్సరాలు పనిచేసి వెళ్లిపోయినా లేదా రిటైర్ అయినా కూడా ఈ గ్రాట్యుటీ ప్రయోజనాల్ని పొందొచ్చ. ఇది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ రంగంలోని వారికి కూడా ప్రయోజనం కల్పిస్తోంది. అసలు గ్రాట్యుటీ అంటే ఏంటి.. ఇక్కడ దేని ప్రాతిపదికన చెల్లిస్తారు. సర్వీస్ ఎన్నేళ్లు ఉంటే గ్రాట్యుటీ ఎంత వస్తుంది. వంటి పూర్తి వివరాల్ని తెలుసుకుందాం.


ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ తమకు అందే ప్రయోజనాల గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది నెల జీతం వచ్చిందా రాలేదా అని చూసుకుంటారు కానీ ప్యాకేజీలో ఇంకేమేమేం ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. చాలా కంపెనీలు తమ ప్యాకేజీలోనే ప్రావిడెంట్ ఫండ్, కరవు భత్యం, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్, వేరియబుల్ పే వంటివి ప్యాకేజీలోనే భాగం చేస్తుంటాయి.


అయితే గ్రాట్యుటీ గురించి చాలా మందికి పెద్దగా తెలిసుండకపోవచ్చు. ఏదైనా సంస్థలో కనీసం 5 సంవత్సరాలు లేదా అంతకుమించి పనిచేస్తే మీరు గ్రాట్యుటీకి అర్హులుగా ఉంటారు. ఉద్యోగి బేసిక్ పే ఆధారంగా దీనిని చెల్లిస్తుంటారు. గ్రాట్యుటీ అనేది.. ఉద్యోగి సర్వీస్ కాలం చివరి సారి అందిన బేసిక్ పేపై లెక్కిస్తారు. ఇక్కడ నెలకు 26 పనిదినాలు అని లెక్కించి గ్రాట్యుటీ చెల్లిస్తారు. ఏదైనా సంస్థలో కనీసం 10 లేదా అంతకంటే ఎక్కువ మంది పనిచేస్తున్నట్లయితే ఆ సంస్థ ఉద్యోగులకు కొంత సొమ్ము రూపంలో ఇచ్చే బెనిఫిట్స్‌నే గ్రాట్యుటీగా చెప్పొచ్చు.


కనీసం ఐదేళ్లు పనిచేయాలి. ఇలా అంతకుమించి ఎన్నేళ్లు పనిచేస్తే దానికి లెక్కించి ఇస్తారు. పని చేసిన ప్రతి ఏడాదికి 15 రోజుల వేతన సమాన సొమ్ము కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. ఏడాదిలో 6 నెలల కంటే ఎక్కువ పనిచేసినా సంవత్సరంగా లెక్కిస్తారు. అంటే మీరు ఐదేళ్ల 6 నెలలు పనిచేసినా కూడా ఆరేళ్లుగా పరిగణిస్తారు. ఇక గ్రాట్యుటీ ఫార్ములా {(నెల జీతంx15x సర్వీస్ కాలం)/26 (పనిదినాలు)} గా ఉంటుంది. ఇక్కడ 15 రోజులు అనేది 15 రోజులకు సమానమైన వేతనం కాబట్టి. 26 అనేది నెలకు 26 పనిదినాలు. నెల జీతం బేసిక్ పేపై వర్తిస్తుంది.


ఇప్పుడు రూ. 30 వేల బేసిక్ పే పై 5 సంవత్సరాలు, ఏడేళ్లు, పదేళ్లకు గ్రాట్యుటీ ఎంత వస్తుందనేది ఫార్ములాను బట్టి తెలుసుకుందాం.


ముందుగా ఐదేళ్ల సర్వీసుకు అయితే బేసిక్ పే రూ. 30 వేలు కాబట్టి గ్రాట్యుటీ= {(30000x15x5)/26}= రూ. 86,538.46 వస్తుంది. ఈ లెక్కనే ఏడేళ్ల సర్వీసుపై రూ. 1,21,153.84; పదేళ్ల సర్వీసుకు అయితే రూ. 1,73,076.92 గ్రాట్యుటీ అందుతుంది. ఇలాగే మీ మీ శాలరీపై, మీ సర్వీసు కాలానికి అనుగుణంగా లెక్కలు వేసుకొని తెలుసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com