తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 15న (బుధవారం) గోదా కళ్యాణం నిర్వహించనున్నారు. మకర సంక్రాంతి మరుసటిరోజైన కనుమ రోజు తిరుమల శ్రీవారి పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు. జనవరి 15న పార్వేట ఉత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఇదే రోజు గోదాపరిణయోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను పెద్ద జీయ్యర్ స్వామి మఠం నుంచి ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువస్తారు. అనంతరం ఆండాల్ అమ్మవారి మాలలను స్వామికి సమర్పిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు మలయప్పస్వామి, కృష్ణస్వామిని పార్వేట మండపానికి తీసుకువెళ్తారు. అక్కడ ఆస్థానం, పార్వేట కార్యక్రమాలు నిర్వహించి.. తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రణయ కలహోత్సవం జనవరి 15వ తేదీ సాయంత్రం జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీవారు తన దేవేరులతో కలిసి ప్రణయ కలహోత్సవంలో పాల్గొంటారు. జనవరి 15వ తేదీ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ తిరుమలలో ప్రణయ కలహోత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాల సందర్భంగా జనవరి 15న తిరుమల శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ విషయాలను భక్తులు గమనించాలని ఓ ప్రకటన విడుదల చేసింది.
జనవరి 15న తిరుపతిలో గోదా కళ్యాణం
జనవరి 15 బుధవారం సాయంత్రం తిరుపతిలో గోదా కళ్యాణం జరగనుంది. టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో టీటీడీ గోదా కల్యాణం నిర్వహించనుంది. బుధవారం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు తిరుపతిలో గోదా కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని టీటీడీ తెలిపింది. గోదా కళ్యాణం సందర్భంగా కృష్ణస్వామి, ఆండాల్ అమ్మవారి ఉత్సవమూర్తులను అలంకరించి ఘనంగా కళ్యాణం జరిపిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసింది. భక్తులు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొనాలని టీటీడీ కోరింది.