ఆస్ట్రేలియా పర్యటనలో అంచనాలకు మించి రాణించిన ఆంధ్రా కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిశాడు. గురువారం (జనవరి 17) తన తండ్రి ముత్యాల రెడ్డితో కలిసి ఉండవల్లికి వచ్చిన నితీశ్ చంద్రబాబు నాయుడును కలిశాడు.ఈ సందర్భంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ గతంలో ప్రకటించిన రూ. 25 లక్షల చెక్ ను చంద్రబాబు చేతుల మీదుగా అందుకున్నాడు నితీశ్. ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ కొట్టినందుకు ఏసీఏ ఈ నజరనా ప్రకటించింది. గురువారం ఏసీఏ అధ్యక్షుడు, టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆ నజరానా చెక్ ను నితీశ్ కుమార్ రెడ్డికి అందించారు. టీమిండియా క్రికెటర్ తో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు చంద్రబాబు. రాబోయే రోజుల్లో ఈ తెలుగు క్రికెటర్ సెంచరీలు కొట్టాలని ఆకాంక్షించారు.'విశేష ప్రతిభావంతుడైన మన యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిని కలిశాను. తెలుగు రాష్ట్రం నుంచి వెలుగులు విరజిమ్ముతున్న నిఖార్సైన ధ్రువతార నితీశ్ కుమార్. తన ఆట ద్వారా ప్రపంచ వేదికపై భారత్ కు గర్వకారణంలా నిలిచాడు. నితీశ్ కెరీర్ ను తీర్చిదిద్దడంలో అతనికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న తల్లిదండ్రులను అభినందించాను. రాబోయే సంవత్సరాల్లో నితీశ్ సెంచరీలు కొట్టాలి. భారత్ కు విజయాలు సాధించి పెట్టాలని ఆకాంక్షిస్తున్నాను' అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.