ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం చేపట్టిన వలంటీర్లను ఎక్కడికక్కడ అడ్డుకోవడం, హౌజ్ అరెస్టులు చేయడం హేయమైన చర్య అని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి ఆక్షేపించారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం సందర్భంగా, తమ సమస్యను సీఎం దృష్టికి తీసుకుపోయేందుకు వలంటీర్లు ‘ఛలో విజయవాడ’ చేపట్టారని ఆయన వెల్లడించారు. అయితే వారిని అడ్డుకోవడం ఏ మాత్రం సరికాదని తేల్చి చెప్పారు. వలంటీర్లు గొంతెమ్మ కోరికలేమీ కోరడం లేదని, ఉగాది రోజున చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు, గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచుతూ, వారిని కొనసాగించాలని స్పష్టం చేశారు. అదే వారిప్పుడు కోరుతుంటే, అడ్డుకోవడం ప్రభుత్వం నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు.