ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అంగరంగ వైభవంగా సాగుతోంది. జనవరి 13న పుష్య పౌర్ణమితో ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక సంగమంలో ఇప్పటి వరకు 7 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్టు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 45 రోజుల పాటు సాగే కుంభమేళాకు దాదాపు 40 కోట్ల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా. ఇందుకోసం యూపీ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. కాగా, ఈ మహాకుంభ మేళా గురించి ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. దీనికి సంబంధించిన అనేక వార్తలు, వీడియోలు, ఫోటోలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో హిందూ దేవుళ్లతో ముద్రించిన మహాకుంభమేళా పోస్టర్‌పై మూత్రం పోసిన ఓ యువకుడ్ని కొందరు పట్టుకుని చితక్కొడుతున్నారంటూ ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు.
క్లైమ్
బాబా బనారస్ అనే నెటిజన్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వీడియో పోస్ట్ చేసింది.. ‘ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయబరేలీలో అబ్దుల్ అనే వ్యక్తి హిందూ దేవుళ్లతో ముద్రించిన మహాకుంభమేళా పోస్టర్‌పై మూత్ర విసర్జన చేశాడు.. ఈ సమయంలో అతడ్ని స్థానికులు పట్టుకుని చితకబాదారు’ అని రాశారు. గతంలో ఈ బాబా పేరుతో ఉన్న అకౌంట్‌లో ఇలాంటి తప్పుడు వీడియోలు అనేక పోస్ట్ అయ్యాయి. తాజా వీడియో కూడా అటువంటిదేనని న్యూస్‌మీటర్ ఫ్యాక్ట్‌చెక్‌లో నిర్దారణ అయ్యింది. మూత్రం పోసిన వ్యక్తి ముస్లిం కాదు. అతడు హిందువే.
ఫ్యాక్ట్
మహాకుంభమేళా పోస్టర్‌పై ముస్లిం యువకుడు మూత్రం పోశాడని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మద్యం మత్తులో మూత్రం పోసిన ఆ వ్యక్తి హిందూ వర్గానికే చెందినవాడేనని న్యూస్‌మీటర్ గుర్తించింది.
నిజనిర్దారణ
వైరల్ అవుతోన్న కీవర్డ్ ఆధారంగా న్యూస్‌మీటర్ ఫ్యాక్ట్‌చెక్ బృందం గూగుల్‌లో శోధించగా జనవరి 11న అమర్ జులా, ఇండియన్ డెయిలీ ప్రచురించిన వార్తా నివేదికలు కనిపించాయి. ఆ నివేదికల ప్రకారం జనవరి 10న సాయంత్రం రాయబరేలి జిల్లా బచ్చార్వన్ సిటిలో ఘటన చోటుచేసుకుంది. ఫుల్లుగా మద్యం తాగిన యువకుడు.. మత్తులో గోడకు అతికించిన పోస్టర్‌పై మూత్ర విసర్జన చేశాడు. ఈ సమయంలో అక్కడ ఉన్నవారు పట్టుకుని దేహశుద్ధి చేయగా.. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, వార్త పత్రికలు మాత్రం అతడు ఏ వర్గానికి చెందినవాడు అనేది స్పష్టంగా పేర్కొనలేదు. కానీ, స్థానిక పోలీస్ అధికారి ఓపీ తివారీ.. వైరల్ వీడియోపై విచారణ జరుగుతోందని తెలిపారు.
ఎక్స్‌లో మరో యూజర్ ఈ వీడియోను షేర్‌చేసి.. మతపరమైన దాడిగా పేర్కొన్నాడు. దీనికి పోలీసులు స్పందిస్తూ.. అతడ్ని కనౌజ్‌కు చెందిన వినోద్ అనే హిందువు అని స్పష్టం చేశారు. మద్యం మత్తులో ఉన్న అతడు.. గోడపై కుంభమేళా పోస్టర్ ఉందన్న తెలివిలేకుండా మూత్రం పోసినట్టు చెప్పారు. అంతేకాదు, వినోద్ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన యువకుడని జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదన్నారు.
బచ్చర్వాన్ స్టేషన్ హౌస్ అధికారి ఓపీ తివారీని న్యూస్‌మీటర్ సంప్రదించగా.. ‘నిందితుడి హిందూ వర్గానికి చెందిన వ్యక్తి.. అతడి పేరు వినోద్.. దినేశ్ అని కూడా పిలుస్తారు.. ఆయన తండ్రి పేరు భరత్’ అని చెప్పారు. అతడు ముస్లిం కాదని తేల్చిచెప్పారు. ఈ ఘటనకు సంబంధించి విడుదల చేసిన ప్రెస్‌నోట్‌ను కూడా పోలీస్ అధికారి బయటపెట్టారు. స్టేట్‌మెంట్‌లో వినోద్ అలియాస్ దినేశ్ అని ఉంది. అతడ్ని చట్టప్రకారం అరెస్ట్ చేసి.. కోర్టు ముందు ప్రవేశపెట్టినట్టు తెలిపారు.
ఇదీ అసలు వాస్తవం
రాయబరేలీలో కుంభమేళా పోస్టర్‌పై ముస్లిం యువకుడు మూత్రం పోశాడని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని న్యూస్‌మీటర్ నిర్దారణకు వచ్చింది.