రష్యా ఉక్రెయిన్‌ల మధ్య చాలా కాలంగా యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వార్‌లో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే అందులో పలువురు భారతీయులు కూడా ఉన్నట్లు తాజాగా భారతీయ విదేశాంగ తెలిపింది. రష్యా తరఫును ఉక్రెయిన్‌పై యుద్ధం చేసిన కొంత మంది భారతీయుల్లో.. ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్లు వెల్లడించింది. అలాగే మరో 16 మంది కనిపించకుండా పోయినట్లు స్పష్టం చేసింది. అంతేకాకుండా మృతుల పట్ల తీవ్ర సంతాపాన్ని కూడా వ్యక్తం చేసింది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రష్యా - ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధంలో మాస్కో తరఫున మొత్తం 126 మంది భారతీయులు పాల్గొన్నట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అయితే ఈ యుద్ధంలో ఇప్పటి వరకు మొత్తం 12 మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. అలాగే మొత్తంగా 16 మంది కనిపించకుండా పోయినట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే 96 మంది భారతీయులు సైన్యం నుంచి బయటకు వచ్చి ఇళ్లకు చేరినట్లు వివరించారు. మరో 18 మంది ఇంకా సైన్యంలోనే ఉంటూ యుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.
వారిని కూడా యుద్ధం నుంచి రప్పించేందుకు చర్యలు..
అలాగే ఇప్పటికీ సైన్యంలోనే ఉన్న 18 మంది భారతీయులను కూడా త్వరగా స్వదేశానికి రప్పించేందుకు తాము చర్యలు చేపట్టామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. 12 మంది మృతుల పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ముఖ్యంగా కేరళకు చెందిన బనీల్ బాబు మృతి చాలా దురదృష్టకమని అని వివరించారు. ఈయన మృతదేహాన్ని తిరిగి భారత్ తీసుకు వచ్చేందుకు తమ రాయబార కార్యాలయం రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని కూడా జైస్వాల్ వెల్లడించారు. ప్రస్తుతం మాస్కోలో వైద్య చికిత్స పొందుతున్న మరో భారతీయుడు కోలుకున్న తర్వాత తిరిగి ఇండియాకు వస్తారని అన్నారు.
ఇంధన ఆంక్షలు, భారతీయ చమురు కొనుగోళ్ల గురించి మాట్లాడుతూ.. భారతీయ సంస్థలపై సంభావ్య ప్రభావాలను అంచనా వేసేందుకు భారత్.. అమెరికా అధికారులతో సన్నిహితంగా సమన్వయం చేసుకుంటుందని చెప్పారు. చమురు కొనుగోళ్లు, సొంత ఇంధన భద్రత అవసరాలు, ప్రపంచ పరిస్థితుల ద్వారా మార్గనిర్దేశం చేయబడతాయని వెల్లడించారు.