పల్నాడు జిల్లా, నరసరావుపేటలో చిన్నారులతో దొంగతనాలు చేయిస్తూ ఓ ముఠా రెచ్చిపోతోంది. అమాయక పిల్లలను డ్రగ్స్‌కు బానిసలుగా చేస్తున్న ముఠా సభ్యులు వారితో చోరీలు చేయిస్తున్నారు. మాట వినని వారిని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. కలం పట్టాల్సిన చేతితో కత్తులు పట్టేలా చేస్తున్నారు. జేబులు కత్తిరించాలని, డబ్బులు, ఫోన్లు ఏవి కనిపిస్తే అవి ఎత్తుకు రావాలని హుకుం జారీ చేస్తున్నారు. తాము చెప్పిన పని చేయకపోతే ప్రాణాలతో ఉండరని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో చిన్నారులు బిక్కుబిక్కుమంటూ వారు చెప్పిందల్లా చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.నరసరావుపేట వరవకట్టకు చెందిన షేక్ ఫారూక్, షారూ ఇద్దరు అన్నదమ్ములు. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా దొంగతనాల్లో కొత్త పంథా ఎంచుకున్నారు. వీరు నేరుగా ఫీల్డ్‌లోకి దిగకుండా అమాయక పిల్లలను రంగంలోకి దింపుతున్నారు. ముందు చిన్నారులకు మాయమాటలు చెప్పి వారికి డ్రగ్స్, గంజాయి అలవాటు చేస్తున్నారు. మత్తుకు బానిసలుగా మార్చి వారితో చేయరాని పనులు చేయిస్తున్నారు. చిన్నారులు గంజాయికి బానిసలుగా మారిన తర్వాత వారిచేత సెల్ ఫోన్ దొంగతనాలు, గంజాయి రవాణా వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఇళ్లు, మార్కెట్, రద్దీగా ఉండే ప్రాంతాలకు మైనర్లను పంపించి చేతివాటం ప్రదర్శించేలా చేస్తున్నారు. ఈ విధంగా చిన్నారులతో ఇప్పటివరకూ 150 దొంగతనాలు చేయించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కాగా, రెండు నెలల క్రితం దొంగతనం చేస్తూ నరసరావుపేట పోలీసులకు ఓ బాలుడు చిక్కాడు. దీంతో అతడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. ప్రస్తుతం అతను జువైనల్ హోమ్ నుంచి బయటకు వచ్చాడు. ఇంటికి వచ్చిన ఆ చిన్నారి ఇకపై దొంగతనాలు మానేయాలని నిర్ణయించుకున్నారు. అయితే బాలుడి ఇంటికి వచ్చిన షారూక్ సోదరులు.. మళ్లీ చోరీలు చేయాలంటూ వేధించడం మెుదలుపెట్టారు. తాను అలాంటి పనులు చేయనని ఎన్నిసార్లు చెప్పినా.. చేయాల్సిందే అంటూ బెదిరింపులకు దిగారు. వారి వేధింపులు తాళలేక ఆ బాలుడు పోలీసులను ఆశ్రయించాడు. మత్తుపదార్థాలు అలవాటు చేసి వారిద్దరూ దొంగతనాలు చేయిస్తున్నారని అసలు విషయాన్ని పోలీసులకు తెలిపాడు. మత్తుమందు తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నామో కూడా తెలియడం లేదని వాపోయాడు. దొంగతనాలు, గంజాయి రవాణా సహా అనేక అంసాఘిక కార్యక్రమాలు చేయిస్తున్నారని, చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని వివరించాడు. వారి నుంచి రక్షించాలంటూ వేడుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు.