ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై డ్రోన్ సంచారం కలకలం రేపింది. మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగరేశారు. శనివారం మధ్యాహ్నం 1:30 నుంచి 1:50 గంటల మధ్య పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంపై డ్రోన్ ఎగిరినట్లు తెలిసింది. అయితే నిర్మాణంలో ఉన్న భవనంపై డ్రోన్ ఎగరడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన నేతలు, డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది ఈ విషయమై డీజీపీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా డ్రోన్ సంచారంపై వివరాలు తెలియజేశారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ ఇటీవల విజయవాడ బుక్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ స్టాల్స్ వద్ద ఉన్న సమయంలోనే విద్యుత్‌కు అంతరాయం కలిగింది. అలాగే ఇటీవల విజయనగరం, మన్యం జిల్లాల పర్యటనకు పవన్ కళ్యాణ్ వెళ్లారు. పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో ఓ నకిలీ ఐపీఎస్ అధికారి హల్‌చల్ చేయడం కూడా కలకలం రేపింది. బలివాడ సూర్యప్రకాష్ రావు అనే నకిలీ ఐపీఎస్ అధికారి పవన్ కళ్యాణ్ పర్యటనలో హల్ చల్ చేయడం, ఆ విషయం కాస్త ఆలస్యంగా తెలియడం సంచలనం రేపింది. దీనిపై వైసీపీ సైతం ప్రశ్నల వర్షం కురిపించింది. సాక్షాత్తూ డిప్యూటీ సీఎం భద్రతలోనే లోపాలు ఏంటని ప్రశ్నించింది. అనంతరం ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత కూడా దీనిపై స్పందించారు.
ఇక పోలీసులు రంగంలోకి దిగి నకిలీ ఐపీఎస్‌ను అదుపులోకి తీసుకోవటం, రిమాండ్‌కు తరలించడం జరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ కూడా నకిలీ ఐపీఎస్ అధికారి వ్యవహారంపై అప్పట్లో స్పందించారు. అది ఇంటెలిజెన్స్, పోలీసులు చూసుకోవాల్సిన బాధ్యతని చెప్పారు. అలాగే ఈ అంశాన్ని డీజీపీ చూసుకోవాలని సూచించారు. అది జరిగిన కొన్ని రోజులకే విజయవాడ బుక్ ఫెస్టివల్ వద్ద ఘటన, తాజాగా డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంపై డ్రోన్ సంచారం కలకలం రేపుతోంది. దీనిపై జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాయి. అలాగే డ్రోన్ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని.. అసలు విషయాలను వెలుగులోకి తేవాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ డ్రోన్ ఎవరిది, ఎవరు ఎగరేశారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.