వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ఉద్దీపన ప్యాకేజి ప్రకటించడంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఇచ్చినంత మాత్రాన విశాఖ ఉక్కును ఉద్ధరించినట్లు కాదని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని గౌరవించినట్టు కాదని సూటిగా విమర్శించారు. ఆ ప్యాకేజితో ఒరిగేదేమీ లేదని, ప్లాంట్ ఆర్థిక కష్టాలు గట్టెక్కలేదని పేర్కొన్నారు. ఇది తాత్కాలిక ఉపశమనం తప్ప, శాశ్వత పరిష్కారం ఎంతమాత్రం కాదని షర్మిల స్పష్టం చేశారు. "విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సెయిల్ లో విలీనం చేయడమే శాశ్వత పరిష్కారం. విశాఖ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించడమే అసలైన పరిష్కారం. ప్లాంట్ సామర్థ్యాన్ని 20 మిలియన్ టన్నులకు విస్తరించినప్పుడే ఉక్కు సంకల్పం నెరవేరినట్టు లెక్క. ఇవేమీ పట్టించుకోకుండా రెండేళ్లలో విశాఖ ఉక్కును నెంబర్ వన్ గా నిలబెడతామనడం ఆంధ్రుల చెవుల్లో కేంద్రం మరోసారి పూలు పెట్టినట్టుగానే భావించాలి" అంటూ షర్మిల ధ్వజమెత్తారు.