పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిందని, ఇప్పుడు అదే ఆ దేశం పాలిట శాపమైందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. పాక్ పెంచి పోషించిన ఉగ్రవాదం ఇప్పుడు ఆ దేశాన్ని కబళిస్తోందన్నారు. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదం క్రమంగా పాక్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తోందన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అణిచివేయాలని భారత్ సహా పలు దేశాలు కోరుతున్నట్లు చెప్పారు.అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ఈ విషయంలో వెనుక ఉండరాదన్నారు. ఆయుధీకరణ విషయంలో భారత్ స్వావలంబన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్నేహాన్ని పెంచుకుంటూ, సమస్యలను తగ్గించుకుంటూ ప్రపంచ వేదికపై భారత్ ఓ నమ్మకమైన భాగస్వామిగా వ్యవహరిస్తోందన్నారు. పరస్పర గౌరవం, ప్రయోజనాలు, సుహృద్భావ సంబంధాలు అనే మూడు అంశాలే భారత దౌత్య విధానం అన్నారు.