వృద్ధాశ్రమంలో జీవిస్తున్న 64 ఏళ్ల తాత, 68 ఏళ్ల బామ్మ.. ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. లేటు వయసులో పెళ్లి చేసుకుని ఒకరికొకరు తోడు నీడగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఆశ్రమ నిర్వాహకులకు చెప్పారు. అందరి అంగీకారంతో ఆ వృద్ధాశ్రమంలోనే దండలు మార్చుకుని పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఈ అరుదైన పరిణయం ఏపీలోని రాజమహేంద్రవరంలో జరిగింది.పూర్తి వివరాల్లోకి వెళితే రాజమహేంద్రవరంలోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో నారాయణపురానికి చెందిన మడగల మూర్తి (64) రెండేళ్లుగా ఉంటున్నారు. అదే ఆశ్రమంలో వైఎస్‌ఆర్ జిల్లా పెనగలూరు మండలం కమ్మలకుంటకు చెందిన గజ్జల రాములమ్మ (68) అనే వృద్ధురాలు కూడా ఉంటున్నారు. అయితే, కొన్ని రోజుల క్రితం ఉన్నట్టుండి మూర్తి పక్షవాతానికి గురయ్యారు. దాంతో లేవలేని పరిస్థితిలో ఉండేవారు. అలాంటి సమయంలో ఆయనకు రాములమ్మ తోడుగా నిలబడ్డారు. అన్నివేళలా అండగా ఉంటూ అన్నీ తానై మూర్తికి సపర్యలు చేసిందామె. దాంతో ఆయన త్వరగానే కోలుకున్నారు.ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మూర్తికి వయసులో ఉన్నప్పటికంటే కూడా వయసుపైబడిన ఈ వయసులోనే ఒక తోడు అవసరమని అనిపించింది. తాను మంచాన పడినప్పుడు తనకు సపర్యలు చేసిన రాములమ్మను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఆయన రాములమ్మతో చెప్పారు. ఆమె కూడా ఒప్పుకుంది. దాంతో ఇద్దరు తమ నిర్ణయాన్ని ఆశ్రమ నిర్వాహకుడు గుబ్బల రాంబాబుకు చెప్పడంతో ఆ వృద్ధ జంటకు శుక్రవారం నాడు ఆశ్రమంలోనే పెళ్లి చేశారు.