తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య సత్యరాజ్ అధికార డీఎంకే పార్టీలో చేరారు. ఇవాళ చెన్నైలో దివ్య ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో డీఎంకే కండువా కప్పుకున్నారు. దివ్యకు డీఎంకే పార్టీలోకి సీఎం స్టాలిన్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం దివ్య మాట్లాడుతూ, తాను చిన్నప్పటి నుంచి డీఎంకే విధానాల పట్ల ఆకర్షితురాలియ్యానని, ప్రజా సేవపై ఆసక్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడించారు. కాగా, దివ్య ఫుడ్ న్యూట్రిషనిస్టుగా పనిచేస్తున్నారు. ఈ అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. తాను న్యూట్రిషనిస్టునని, డీఎంకే ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే పార్టీ అని ఆ పార్టీలో చేరడానికి ఇది కూడా ఓ కారణమని అన్నారు. డీఎంకే మహిళలకు గౌరవం ఇచ్చే పార్టీ అని కొనియాడారు. కాగా, దివ్య సత్యరాజ్ 2019 ఎన్నికల సమయంలోనే స్టాలిన్ ను కలిశారు. దాంతో ఆమె రాజకీయాల్లోకి వస్తారంటూ అప్పట్లోనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే అది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని నాడు సత్యరాజ్ కుటుంబం పేర్కొంది.