మలేసియాలో జరుగుతున్న ఐసీసీ అండర్-19 అమ్మాయిల టీ20 వరల్డ్ కప్ లో భారత్ అదరగొట్టింది. కౌలాలంపూర్ లో ఇవాళ వెస్టిండీస్ తో జరిగిన పోరులో టీమిండియా అమ్మాయిలు 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో, తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 13.2 ఓవర్లలో 44 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో పరుణికా సిసోడియా 3, వీజే జోషిత 2, ఆయుషి శుక్లా 2 వికెట్లతో రాణించారు. అనంతరం, 45 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా అమ్మాయిలు అలవోకగా ఛేదించారు. కేవలం 4.2 ఓవర్లలోనే 1 వికెట్ నష్టానికి 47 పరుగులు చేసి విజయం అందుకున్నారు. ఓపెనర్ గా దిగిన తెలుగమ్మాయి గొంగడి త్రిష 4 పరుగులకే అవుటైనా... మరో ఓపెనర్ కమలిని 16, సనికా చల్కే 18 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.