దేశంతోనూ కాంగ్రెస్ పోరాడుతోందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఆయనపై ఆసోంలోని గువాహటి పాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. రాహుల్ వ్యాఖ్యలు దేశ సార్వభౌమాధికారానికి, ఐక్యత, దేశ సమగ్రతకు ప్రమాదకరం కలిగిస్తాయని పేర్కొంటూ భారతీయ న్యాయసంహిత లోని 152, 197(1) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. మోన్‌జిత్ చాటియా అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు.దేశంతో పోరాటం సాగిస్తున్నామని ప్రకటించడం ద్వారా నిందితుడు ఉద్దేశపూర్వకంగానే విచ్ఛిన్నకర శక్తులను, ప్రజలపై తిరుగుబాటు చర్యలను రెచ్చగొట్టినట్టు ఫిర్యాదుదారు ఆరోపించారు. వరుస వైఫల్యాలతో నైరాశ్యంతోనే రాహుల్ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగారన్నారు. ప్రజాస్వామ్య విధానాల ద్వారా ప్రజా విశ్వాసం పొందలేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ స్టేట్‌పై అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. విపక్ష నేతగా ప్రజాస్వామ్య సంస్థలపై విశ్వాసాన్ని పెంపొందించాల్సిన నేత.. ఇందుకు బదులుగా తన హోదాను దుర్వినియోగం చేసుకుంటూ తప్పుడు ప్రచారం, తిరుగుబాటు చర్యలకు పాల్పడటం దేశ సమగ్రత, సార్వభౌమాధికారానికి ముప్పు అని తన ఫిర్యాదులో చాటియా పేర్కొన్నారు.