గిరిజన ఉత్పత్తులకు ప్రచారం కల్పించి అడవి బిడ్డల ఆదాయ వనరులు మెరుగుపరచడం ఎంతో ముఖ్యమని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివాసీ-గిరిజన ఉత్పత్తులను నేటి అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో "గిరిజన-ఆదివాసీ సమ్మేళనం" కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. అడవి బిడ్డల వివిధ రకాలను వస్తువులను తయారు చేస్తారని, వాటన్నింటినీ ప్రకృతిలో దొరికే ముడి సరకుతో అత్యంత అద్భుతంగా రూపొందిస్తారని ఆయన చెప్పారు. ఇలాంటి గిరిజన ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని చెప్పుకొచ్చారు.ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వ్యాపార రంగంలో వారంతా రాణించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. గిరిజన వస్తువులు, హస్త కళలకు ప్రచారం కల్పించడం ద్వారా వారి ఆదాయం పెంచి జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా చూడాలని కోరారు. ఆదివాసీ-గిరిజన ఉత్పత్తులను ప్రపంచస్థాయిలో నిలబెట్టేందుకు నేటి అవసరాలకు అనుగుణంగా వాటిని రూపొందించాలని సూచించారు. దీని ద్వారా ఆయా ఉత్పత్తుల స్థాయి, విలువ పెంచడం సాధ్యం అవుతుందని ఆయన చెప్పారు. గిరిజన సోదరులు సైతం వివిధ ఉత్పత్తులు, హస్త కళలకు సంబంధించి తమకు ఉండే సహజ సిద్ధ నైపుణ్యాలకు వ్యాపార విలువలను జోడించుకోవాలని సూచించారు. అలాగే ఈ-కామర్స్, డిజిటల్ వ్యాపార మార్గాలపై దృష్టి పెట్టాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు.