తిరుమల కొండపై ఎగ్ బిర్యానీ ఘటన మరువకముందే ఆంధ్రప్రదేశ్‌లోని మరో ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ లక్ష్మి నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో అపచారం జరిగింది. కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కార్యాలయంలో మద్యం బాటిళ్లు, బిర్యానీ ప్యాకెట్లు దర్శనం ఇవ్వటం కలకలం రేపుతోంది. దేవస్థానం కార్యాలయంలో మందు బాటిళ్లు, బిర్యానీ ప్యాకెట్లు చూసి భక్తులు షాక్ తిన్నారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఇదేంపనంటూ భక్తులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు రావటంతో.. వీటిని చూసిన నెటిజనం నుంచి కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేవాలయం పవిత్రతను కాపాడాల్సిన అధికారులు ఉండే కార్యాలయంలో ఇలాంటివి బయటపడటం ఏమిటంటూ ప్రశ్ని్స్తున్నారు.
మరోవైపు దేవస్థానం కార్యాలయంలో మందు బాటిళ్లు, బిర్యానీ ప్యాకెట్ల వ్యవహారం వెనుక ఆలయ సిబ్బంది పాత్ర ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తతంగమంతా నైట్ డ్యూటీ సిబ్బంది నిర్వాకంగా భావిస్తున్నారు. భక్తుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతూ ఉండటంతో ఈ వ్యవహారంపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. అటు మందు బాటిళ్ల వ్యవహారంపై రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సైతం స్పందించారు. దేవస్థానం కార్యాలయంలో మందు బాటిళ్లు, బిర్యానీ ప్యాకెట్ల వ్యవహారంపై దేవాదాయ శాఖ, పోలీసులతో దర్యాప్తు జరుపుతామని.. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆలయాన్ని అపవిత్రపరిచే ఇలాంటి పనులను ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
అలాగే జిల్లా దేవాదాయశాఖ అధికారులు కూడా దీనిపై స్పందించారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామని.. ఆలయ ప్రాంగణంలోని సీసీ పుటేజీ పరిశీలన సహా, పలు కోణాల్లో విచారణ చేపట్టి ఉన్నతాధికారులను నివేదికను సమర్పిస్తామని తూర్పుగోదావరి జిల్లా దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు.
మరోవైపు తిరుమలలోనూ ఇలాంటి ఘటనే ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. తిరుమల రాంభగీచా బస్టాండ్ సమీపంలో కొంతమంది ఎగ్ బిర్యానీ తీసుకురావటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తమిళనాడుకు చెందిన కొంతమంది భక్తులు ఎగ్ బిర్యానీ భోజనం చేస్తున్న సమయంలో భక్తులు గుర్తించి టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. టీటీడీ సిబ్బంది, పోలీసులు వారిని ప్రశ్నించగా.. కొండపైకి అలాంటి పదార్థాలు తేకూడదనే విషయం తెలియదంటూ భక్తులు సమాధానమిచ్చారు. దీంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.