ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ భద్రతపై ప్రతీ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నామన్నారు. ఉపముఖ్యమంత్రి ఇంటిపై డ్రోన్ ఎగురవేయడంపై విచారణ చేస్తామని.. పవన్ ఇంటిపై డ్రోన్ ఎగిరిందా? లేదా? అన్నది నిర్ధారిస్తామని చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ ఏజెన్సీ పర్యటనలో భద్రతాపరంగా ఎలాంటి లోపం లేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరనే విషయంపైనా విచారణ జరుగుతుందని డీజీపీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. ఈరోజు (సోమవారం) ఉదయం రాజమండ్రిలో డీజీపీ పర్యటించారు. ఈ సందర్భంగా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌బంక్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన డీజీపీ.. పవన్ భద్రత అంశాన్ని సీరియస్‌గా విచారణ చేస్తున్నట్లు తెలిపారు. పవన్ ఇంటిపై డ్రోన్ కెమెరా ఎగిరిన ఘటనపై పోలీస్ శాఖ సీరియస్‌గా దర్యాప్తు చేస్తోందని.. నిన్న సాయంత్రానికి విచారణ పూర్తి కావాల్సి ఉందన్నారు. డ్రోన్ ఎగరడంపై పోలీసులు ముఖ్యమైన సమాచారాన్ని సేకరించారని తెలిపారు. అయితే ఈరోజు కూడా విచారణ కోసం కొంత సమయం కావాలని పోలీసులు అడిగారని.. నేటి సాయంత్రానికి డ్రోన్ కెమెరా ఎగిరిన అంశానికి సంబంధించి మొత్తం విచారణ పూర్తి అవుతుందని డీజీపీ తెలిపారు.