ఛత్తీస్‌గఢ్- ఒడిశా సరిహద్దులోని జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో అనేక మంది మావోయిస్టులు మంగళవారం హతమయ్యారు. దీంతో జనవరి 19 రాత్రి నుంచి పలుమార్లు జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య 20కి చేరిందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 16మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు రాయ్‌పుర్ జోన్ ఐజీ అమ్రేశ్ మిశ్ర వెల్లడించారు.మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సరిహద్దు జిల్లాలైన గరియాబంద్, నౌపాడలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా జనవరి 19 రాత్రి ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారి తెలిపారు. జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఛత్తీస్‌గఢ్ CoBRA, ఒడిశా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG), భద్రతా సిబ్బంది ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు ఆయన చెప్పారు.సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా నక్సలైట్లు మరణించగా, ఒక కోబ్రా జవాన్ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో ఆయనను రాయ్‌పుర్‌కు తరలించారు. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం నుంచి పెద్ద మొత్తంలో తుపాకులు, మందుగుండు సామగ్రి, IEDలు, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మంగళవారం ఉదయం కూడా కాల్పులు కొనసాగగా, అనేక మంది నక్సల్స్ హతమయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.