టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 12 ఏళ్ల తర్వాత మళ్లీ రంజీల్లోకి దిగబోతున్నాడు. జనవరి 30 నుంచి రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌కు ఢిల్లీ తరఫున ఆడనున్నాడు. ఈ మేరకు ధీనిపై ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌కు ఇది వరకే సమాచారం ఇచ్చాడు. వాస్తవానికి ఈనెల 23 నుంచి సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్‌లోనే కోహ్లీ ఆడతాడని అంతా భావించారు. రోహిత్ శర్మ,యశస్వి జైశ్వాల్, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్లు తమతమ జట్లకు ఆడేందుకు సిద్ధమయ్యారు. కానీ మెడ నొప్పి కారణంగా కోహ్లీ ఈ నెల 23 నుంచి సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్‌కు దూరమయ్యాడు.
విరాట్ కోహ్లీ చివరిసారిగా 2012లో ఉత్తరప్రదేశ్‌తో టెస్టులో ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడాడు. 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న కోహ్లీ.. ఆ తర్వాత ఈ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు చేసిన విరాట్.. రెండో ఇన్నింగ్స్‌లో 43 రన్స్ స్కోరు చేశాడు. తాజాగా 12 ఏళ్ల తర్వాత మళ్లీ రంజీ మ్యాచ్‌లో కోహ్లీ ఆడనున్నాడు.
కాగా ఆస్ట్రేలియా పర్యటనతో పాటు స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ కోల్పోవడంపై బీసీసీఐ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని సమయంలో ఆటగాళ్లంతా తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని స్పష్టం చేసింది. దీనిపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో విరాట్, రోహిత్, జడేజా సహా స్టార్ ప్లేయర్లంతా.. మళ్లీ రంజీల బాట పట్టారు.
ఇక ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ ఆశించిన మేర రాణించలేకపోయాడు. పెర్త్ టెస్టులో సెంచరీ చేసినా.. మిగతా మ్యాచ్‌లలో దారుణంగా విఫలమయ్యారు. ఐదు టెస్టుల్లో కలిపి.. 23.75 సగటుతో 190 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అతడు ఫామ్‌లోకి రావాలని పట్టుదలతో ఉన్నాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందే భారత్.. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. ఫిబ్రవరి 6 నుంచి మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. కోహ్లీ.. రైల్వేస్‌తో మ్యాచ్ ఆడి.. భారత జట్టుతో కలవనున్నాడు.