గత ప్రభుత్వంలో రద్దు చేసిన టిడ్కో ఇళ్లు, పింఛన్లను పునరుద్ధరించాలి. వైసీపీ నేతల భూకబ్జాలపై విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలి’ అని పలువురు టీడీపీ గ్రీవెన్స్‌లో విజ్ఞప్తి చేశారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు వినతులు స్వీకరించి, బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అర్హులకు పింఛన్ల పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన మైలాపురం లక్ష్మీదేవి అర్జీ ఇస్తూ, 2018లో టీడీపీ ప్రభుత్వం తమకు మంజూరు చేసిన టిడ్కో గృహాన్ని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని వాపోయారు. 2019కి ముందు తనకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ వచ్చేదని, వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా రద్దు చేసిందని, దానిని పునరుద్ధరించాలని అన్నమయ్య జిల్లా చిన్నతిప్పసముద్రం గ్రామానికి చెందిన బీ ఉత్తమరెడ్డి వేడుకున్నారు. చిత్తూరు జిల్లా కృష్ణాపురంలో తమ కుటుంబం సాగు చేసుకుంటున్న భూమిని వైసీపీ నాయకులు రౌడీయిజం చేస్తూ, కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని యశ్వంత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా జరుట్ల రామాపురంలో తన ఐదెకరాల పొలానికి రికార్డులు తారుమారు చేసి, వైసీపీకి చెందిన చందప్ప పట్టా పుట్టించుకున్నాడని షేక్సానుపల్లికి చెందిన వడ్డే ఎర్రిస్వామి వాపోయారు. తన భూమి తనకు దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరారు.