పల్లె పండుగ కార్యక్రమంలో మంజూరైన పనులన్నింటినీ వచ్చే నెల మొదటి వారంనాటికి పూర్తిచేసి బిల్లులు అప్‌లోడ్ చేయాలని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమీుక్షా సమావేశం నిర్వహించారు. మండలాలవారీగా మంజూరైన పనులు, పూర్తయిన పనులు, బిల్లులు మంజూరు, పెండింగ్ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇప్పటికే మంజూరైన రహదారులు, కల్వర్టులు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు పూర్తిచేసిన తరువాతనే కొత్త పనులకు ప్రతిపాదనలు పంపించాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు వున్న ప్రతి కుటుంబానికి వంద రోజులపాటు పనులు కల్పించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఉపాధి హామీ పథకం పనులపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ, మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టిన పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. అనంతరం గృహ నిర్మాణ సంస్థ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, లక్ష్యాలకు అనుగుణంగా గృహ నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఆయా సమీక్షా సమావేశాల్లో పంచాయతీరాజ్ శాఖ ఈఈ కే వీరన్నాయుడు, డివిజనల్ ఇంజనీర్లు, సహాయ ఇంజనీర్లు, డ్వామా పీడీ పూర్ణిమదేవి, పీఆర్ ఈఈ వీరన్నాయుడు, పశుసంవర్థక శాఖ అధికారి రామ్మోహన్‌రావు, గృహ నిర్మాణ సంస్థ పీడీ శ్రీనివాసరావు, డీఈలు, జేఈలు పాల్గొన్నారు.