ప్రధానమంత్రి జన్‌మన్ యోజనలో భాగంగా జిల్లాలో ఆదిమ జాతి గిరిజనులకు మంజూరు చేసిన ఇళ్లను 2026 మార్చినాటికి పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ అన్నారు. న్యూఢిల్లీలో మంగళవారం నిర్వహించిన పీఎం జన్‌మన్ యోజన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు పీఎం జన్‌మన్ యోజనలో 23,766 ఇళ్లు, 178 గ్రామాలకు 146 రోడ్లు, 28 అంగన్‌వాడీలకు భవనాలు, 1,660 ఇళ్లకు తాగునీటి కుళాయిలు, 59 మల్టీపర్సస్ కేంద్రాలు మంజూరయ్యాయన్నారు. ఆయా పనులన్నీ పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ఇంతవరకు 226 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని, మిగిలిన ఇళ్లను వచ్చే ఏడాది మార్చినాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామన్నారు. అటవీ ఉత్పత్తుల విలువ పెంచేందుకు 16 వన్‌ధన్ వికాస కేంద్రాలను మంజూరు చేశామని, వాటిలో 800 మంది సభ్యులుగా ఉన్నారన్నారు. కేంద్ర సాయంతో అమలవుతున్న పథకాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామని కలెక్టర్ దినేశ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏలకు చెందిన పీవోలు వి.అభిషేక్, కె.సింహాచలం, అపూర్వభరత్ పాల్గొన్నారు.