గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో ఎట్టకేలకు మంగళవారం రెగ్యులర్ క్రషింగ్ ప్రారంభమైంది. ఇందుకోసం సోమవారం నుంచే ఫ్యాక్టరీకి చెరకు రాక ప్రారంభమైంది. మంగళవారం ఉదయం క్రషింగ్‌కు శ్రీకారం చుట్టారు. వాస్తవంగా డిసెంబరు మొదటివారంలో క్రషింగ్ సీజన్ ప్రారంభం కావాలి. అయితే ఈ ఏడాది తీవవ్ర ఆర్థిక సమస్యల కారణంగా క్రషింగ్‌పై నీలినీడలు అలముకున్నాయి. సాధారణ సమయంతో పోలిస్తే ఈసారి పక్షం రోజులు ఆలస్యంగా గత నెల 25వ తేదీన ఫ్యాక్టరీ ఎండి సన్యాసినాయుడు, చెరకు గడలను కేన్ క్యారియర్‌లో వేసి క్రషింగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అయితే అంతకుముందు వరకు వర్షాలు పడడంతో చెరకులో రసనాణ్యత పూర్తిస్థాయిలో వుండదన్న ఉద్దేశంతో రెగ్యులర్ క్రషింగ్‌ను వెంటనే ప్రారంభించలేదు. తరువాత వేతన బకాయిల కోసం కార్మికులు ఆందోళనకు దిగడం, సంక్రాంతి పండుగ రావడంతో క్రషింగ్ మరికొంత కాలం వాయిదాపడింది. ఈ దశలో స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపారు. గోవాడ షుగర్స్ సమస్యలపై ఆర్థిక మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి పరిస్థితిని వివరించి, ప్రభుత్వం నుంచి ఫ్యాక్టరీకి ఆర్థిక భరోసా లభించేలా కృషిచేస్తామని చెప్పారు. దీనితో కార్మికులు సమ్మె విరమించి మూడు రోజుల క్రితం విధుల్లో చేరారు.దీంతో మంగళవారం నుంచి రెగ్యులర్ క్రషింగ్‌కు ఏర్పాట్లు చేశారు. కాగా ఈ ఏడాది లక్షా 30 వేల టన్నుల చెరకు క్రషింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, చెరకు రైతులు, కార్మికులకు బకాయిలు చెల్లించడానికి చర్యలు చేపట్టామని ఫ్యాక్టరీ ఎండీ వి.సన్యాసినాయుడు తెలిపారు.