కట్టెల ట్రాక్టర్‌ను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కొండపి-మ ద్దులూరు రోడ్డులోని ఓ ప్రైవేటు కోల్డ్‌స్టోరేజీ వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వీరంతా ప్రకాశం జిల్లా, ముండ్లమూరు మండలం శంకరాపురానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. శంకరాపురం గ్రామానికి చెందిన చిరంజీవి, అవీన్, దుర్గారావుతోపాటు వారి బంధువైన గుంటూరు జిల్లా నూజెండ్లకు చెందిన నిమ్మళ్ల వెంకటరావు హైదరాబాద్‌లో వివిధ పనులు చేస్తుంటారు. సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలకు వచ్చారు. జరుగుమల్లి మండలం కామేపల్లిలోని పోలేరమ్మ గుడికి వెళ్లి మద్యం తాగకుండా ఉండేందుకు అక్కడ అంత్రం కట్టించుకున్నారు. రాత్రికి తిరిగి రెండు మోటార్ సైకిళ్లపై స్వగ్రామానికి బయల్దేరారు. బైక్‌ను అవీన్ నడుపుతున్నాడు. వెనుక చిరంజీవి, దుర్గారావు కూర్చున్నారు. కాగా మూగచింతల గ్రామానికి చెందిన కట్టెల ట్రాక్టర్ కొండపి వైపు ఎదురు వస్తుండగా ప్రమాదవశాత్తు బైక్ ఢీకొంది. దీంతో తలకు బలమైన గాయాలవడంతో చిరంజీవి (44) అక్కడికక్కడే మరణిం చాడు. బండి నడుపుతున్న అవీన్, వెనుక కూర్చున్న దుర్గారావుకు బల మైన గాయాలయ్యాయి. అటుగా వస్తున్నవారు 108 వాహనానికి సమాచారం అందించడంతో ఇద్దరినీ కొండపిలోని సీహెచ్‌సీకి తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతూ దుర్గారావు (33) మరణించారు. మెరుగైన వైద్యం కోసం అవీన్‌ను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మృతుల్లో ఒకరైన చిరంజీవి బంధువు నిమ్మళ్ల వెంకటరావు ఘటన వివరాలను వివరిస్తూ.. అవీన్, చిరంజీవి, దుర్గారావు ముగ్గురు ఒకే వాహనంపై వస్తున్నారని, తాను ముందుగా వెళ్తున్నానని తెలిపాడు. కొండపిలో బయల్దేరేటప్పుడు తాను జాగ్రత్తగా రండి అన్నానని, అయితే బండి నడుపుతున్న అవీన్ తాను కొమరం పులిని... ఏమీ కాదన్నాడని విలపిస్తూ వివరించాడు. తాను ముందు వెళుతూ ఎంతకూ రాకపోవడంతో అనకర్లపూడి వద్ద నుంచి వారికి ఫోన్ చేయగా, ఎవరో లిఫ్ట్ చేసి ప్రమాదం జరిగిందని వివరించారని వెంకటరావు తెలిపాడు. తాను ఘటనా స్థలికి వెళ్లేసరికి తనకు బాబాయి వరసయ్యే చిరంజీవి విగతజీవిగా పడి ఉన్నాడని విలపించాడు. తాను శంకరాపురంలో వివాహం చేసుకున్నానని తన భార్య మేనమామ చిరంజీవని వివరించారు. ఆయనకు ఇటీవలే భార్య కూడా చనిపోయిందన్నాడు. అందరం సంక్రాంతి పండుగకు వచ్చామని, బుధవారం హైదరాబాద్ వెళ్లాల్సి ఉందని ఆయన వివరించారు. కాగా ఘటనాస్థలానికి కొండపి సీఐ జి.సోమశేఖర్, ఎస్సై ప్రేమ్‌కుమార్ చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ సోమశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ హెల్మెట్ పెట్టుకుని ఉంటే వారి ప్రాణాలు దక్కేవన్నారు.