ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటక సీఎం పదవిపై డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు.. జైన సన్యాసి కోరికపై స్పందన

national |  Suryaa Desk  | Published : Wed, Jan 22, 2025, 08:27 PM

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిపోగా.. ముఖ్యమంత్రి వ్యవహారం మాత్రం ఇప్పటికీ ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ ఘన విజయం సాధించి.. అధికారాన్ని దక్కించుకోగా.. సీఎం సీటు కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ముమ్మర కసరత్తు తర్వాత కాంగ్రెస్ హైకమాండ్.. ఆ పదవిని సిద్ధరామయ్యకు కట్టబెట్టగా.. డిప్యూటీ సీఎం పదవిని డీకే శివకుమార్‌కు అప్పగించి.. సమస్యను సద్దుమణిగేలా చేసింది. అయితే చెరో రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పంచుకుంటారని.. కాంగ్రెస్ వర్గాల్లో అప్పటి నుంచే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సీఎం పదవిపై డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.


సోమవారం హుబ్లీలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన జైన సన్యాసి గుణధర్ నంది మహారాజ్.. తనకు రెండు కోరికలు ఉన్నాయని చెప్పారు. అందులో ఒకటి జైన డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బోర్డును ఏర్పాటు చేయడం.. మరొకటి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కావాలని పేర్కొన్నారు. అనంతరం అదే కార్యక్రమానికి హాజరైన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. మీలాంటి ఆశీర్వాదం ఇస్తే తాను ఏం చెప్పగలనని వెల్లడించారు. ఆ గుణధర్ నంది మహారాజ్ చెప్పేదానికి తాను అడ్డు చెప్పలేనని.. ఎందుకంటే అది ఆయన కోరిక అని తెలిపారు.


ఇక తనకు ఏం కావాలో అన్నీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుందని పేర్కొన్న డీకే శివకుమార్.. తనకు పార్టీ ముఖ్యమని.. హైకమాండ్ ఆదేశాల ప్రకారమే తాను పని చేస్తానని స్పష్టం చేశారు. తాను ఏ పదవి కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. అయితే మంగళవారం బెళగావిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సదస్సు సందర్భంగా డీకే శివకుమార్ మద్దతుదారుల బల ప్రదర్శన కనిపించింది. కొప్పల్, హోసపేట, బళ్లారి, చిత్రదుర్గ్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కోసం ర్యాలీగా అతడి ఫోటోలు పట్టుకుని నినాదాలు చేయడం.. ఆయన బలాన్ని తెలియజేసింది.


మరోవైపు.. డీకే శివకుమార్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని అతని మద్దతుదారులు పేర్కొంటున్నారు. డీకేఎస్‌కు సీఎం పదవీ ఇవ్వకపోతే.. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అస్థిరతను ఎదుర్కొంటుందని కొందరు హెచ్చరిస్తున్నారు. కర్ణాటక సీఎం పదవిపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ స్పందించింది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ కోసం హైకమాండ్ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. ఎవర్ని ఏ పదవిలో నియమించాలి.. ఎప్పుడు తొలగించాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసని ఖర్గే తేల్చి చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com