తిరువూరులో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అధికార దుర్వినియోగంకు పాల్పడుతున్నాడని వైయస్ఆర్ సీపీ ఎన్టీఆర్ విజయవాడ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. సంక్రాంతికి ముందు ఒక ప్రైవేటు స్థలం వివాదంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు జోక్యం చేసుకుని గోపాలపురం గ్రామంలోని వైయస్ఆర్సీపీ వార్డు సభ్యురాలు భూక్యా చంటి, ఆమె భర్త కృష్ణ, వారి కుమారులపై ప్రత్యక్షంగా దాడిచేసి గాయపరిచిన ఘటనపై తక్షణం చర్యలు తీసుకోవాలి. బాధ్యతయుతమైన ఎమ్మెల్యే స్థానంలో ఉన్న నేత ఇటువంటి దాడులకు పాల్పడితే ఇక సామాన్యులకు రక్షణ ఉంటుందా? తెలుగుదేశం పార్టీ ఈ ఘటనపై పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న ఆగ్రహంతో క్రమశిక్షణ సంఘం పేరుతో హంగామా చేసి, చేతులు దులుపుకున్నారు. ఈ దాడిని చిత్రీకరించిన భూక్యా చంటి కుమారుడి సెల్ ఫోన్ ను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకుని దానిలోని వీడియోను డిలీట్ చేయడం ఎంత వరకు సమంజసం? గతంలో వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో ఏనాడు ఇటువంటి దాడులను ప్రోత్సహించలేదు. నేడు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకం సృష్టిస్తున్నారు. చివరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఈ ఎమ్మెల్యే అరాచకాలపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భూక్యా చంటి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైయస్ఆర్ సీపీ పోరాడుతుందని తెలియజేసారు.