చంద్రబాబు సర్కారు బరితెగించి అమలు చేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగం రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర విఘాతంగా మారింది అని వైసీపీ నేతలు వాపోతున్నారు. వారు మాట్లాడుతూ.... టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ అంటేనే హడలెత్తిపోతున్నారు. పెట్టుబడులు కాదు కదా కనీసం ఇటువైపు చూసేందుకు కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఈ కక్ష సాధింపు దుష్పరిణామాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. అంతర్జాతీయ గుర్తింపు పొందిన పారిశ్రామిక సంస్థ జేఎస్‌డబ్లూ గ్రూపు ఏపీ అంటేనే ముఖం చాటేయడం దీనికి తాజా తార్కాణం. వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్రంలో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్న ఆ సంస్థ తాజాగా మన రాష్ట్రాన్ని కాదని.. మహారాష్ట్రలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వెచ్చించేలా ఒప్పందం చేసుకోవడం గమనార్హం. అంతేకాకుండా రూ.800 కోట్లతో తెలంగాణలో డ్రోన్ టెక్నాలజీ యూనిట్ నెలకొల్పాలని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ నిర్ణయించింది. జేఎస్‌డబ్లూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్‌ను కేంద్ర బిందువుగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులతో వేధించడంతోనే ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్‌అంటే హడలిపోయి మహారాష్ట్ర, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడింది. టీడీపీ సర్కారు కక్ష సాధింపు చర్యలతో ఆంధ్రప్రదేశ్ ఏకంగా రూ.3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు కోల్పోయిన ఉదంతం ఇలా ఉంది అని తెలియజేసారు.