పేద పిల్లలు చదువుకుంటున్న సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి హెచ్చరించారు. ఒంగోలు కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో బుధవారం సంక్షేమ, వైద్య, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వసతి గృహాల నిర్వహణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూ.143కోట్లతో హాస్టల్ భవనాలకు మరమ్మతులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఆ నిధులతో వెంటనే పనులు పూర్తిచేయాలన్నారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. ఖాళీలు ఉన్న హాస్టల్స్‌లో సామాజికవర్గంతో సంబంధం లేకుండా అడ్మిషన్లు మంజూరుచేయాలన్నారు. దివ్యాంగ విద్యార్థులు పెన్షన్ల కోసం ప్రతినెలా వారి స్వగ్రామాలకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే డబ్బులు వేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన సేవలు అందించాలని వైద్యశాఖ అధికారులకు సూచించారు. మాతాశిశు మరణాలు తగ్గించడంతోపాటు ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గుండెపోటు సంభవించినప్పుడు తక్షణమే ప్రమాదాన్ని నివారించేందుకు ఇంజెక్షన్ వేసే స్టెమీ ప్రాసెస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాగర్ జలాలు మరోసారి విడుదల చేయనున్నారని, వాటితో చెరువులను పూర్తిస్థాయిలో నింపేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్వామి ఆదేశించారు.