అప్పు తీర్చాలని అడిగినందుకు కులం పేరుతో దూషించి, దాడి చేసిన ఘటనలో నలుగురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తారకేశ్వరరావు బుధవారం తెలిపారు. ఈ ఘటనపై ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా, బాడంగి మండలంలోని డొంకినవలస గ్రామానికి చెందిన వడ్డే మధు బాడంగి ఎత్తుఖాణా వద్ద పాన్‌షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. మధు వద్ద పెదపల్లి గ్రామానికి చెందిన ఆవు నరసింహరావు, ఆవు ప్రసాద్ కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారు. ఎప్పటిలాగే నరసిం హరావు, ప్రసాద్.. రామభద్రపురం మండలం రొంపల్లి గ్రామానికి చెందిన సారి మోహన్, సాలూరు మెంటాడ వీధికి చెందిన బెవర గణేష్‌లతో కలిసి మంగళ వారం రాత్రి మధు పాన్‌షాపు వద్దకు వచ్చారు. ఈక్రమంలో తన డబ్బులు ఎప్పుడు ఇస్తారని మధు అడిగాడు. దీంతో ఆ నలుగురు మధుతోపాటు అక్కడ ఉన్న సురేష్ అనే వ్యక్తిపై కులం పేరుతో దూషించి, దాడిచేశారు. ఈ దాడిలో మధుకు తలపై, వీపుపై గాయాలయ్యాయి. సురేష్‌కు చెవి, కన్నుపై గాయాలయ్యాయి. వారు స్థానిక చికిత్స నిమిత్తం సీహెచ్‌సీలో చేరారు. మధును అక్కడ నుంచి విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. మధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నలుగురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.