విజయవాడ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు ఉపయోగిస్తున్న అస్త్రం ఏఐ టూల్‌ను అన్ని నగరాల్లో ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలను కొంత వరకు తగ్గించవచ్చు’ అని హోంమంత్రి అనిత అన్నారు. ఐదేళ్లలో భ్రష్టుపట్టిన అన్ని వ్యవస్థలను కూటమి ప్రభుత్వం గాడిన పెడుతోందన్నారు. ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్ అధికారులు ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన 1,000 సీసీ కెమెరాలు, నూతనంగా ఏర్పాటుచేసిన సురక్ష కమిటీలు, మాదకద్రవ్యాలను అరికట్టడానికి అమర్చిన ‘ఈగల్’ వాహనాలను విజయవాడలో బుధవారం ప్రారంభించారు. అస్త్రం ఏఐ టూల్‌తో ట్రాఫిక్ సమస్యను పూర్తిగా పరిష్కరించకపోయినా కొంతవరకు ఫలితాలను సాధించవచ్చన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని పనితీరును మెరుగుపరుచుకోవాలని చంద్రబాబు చేసిన సూచనలను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు తూచా తప్పకుండా పాటిస్తున్నారని ఆమె కొనియాడారు. ట్రాఫిక్ నియంత్రణకు ఏఐ టూల్స్‌ను ఉపయోగించడం, బందోబస్తుల సమయంలో డ్రోన్లను వినియోగించడం మంచి పరిణామమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా ప్రజల భాగస్వామ్యంతో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించడం శుభపరిణామంగా పేర్కొన్నారు. ప్రజాభద్రత విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. పోలీసులు చేసే పనిని ప్రజల ఆమోదం తీసుకుని చేయడం కోసం సురక్ష కమిటీలను ఏర్పాటు చేశారన్నారు. ప్రజలతో పనిచేయించే బాధ్యతను పోలీసులు తీసుకోవడం మామూలు విషయం కాదన్నారు. డీజీపీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసుల పనితీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు దర్యాప్తు తీరును, ప్రవర్తనను, ఆలోచనా విధానాలను మార్చుకుని ప్రజలకు మెరుగైన సేవలను అందించాలన్నారు. ప్రజల్లో భద్రతా సంస్కృతిని పెంపొందించేలా కమ్యూనిటీ పోలీసింగ్‌ను నిర్వహించడం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. రాష్ట్రంలో ప్రతి వీధి నిఘాలో ఉండేలా మార్చి నెలాఖరునాటికి లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రజా భద్రతకు సీసీ కెమెరాలు దోహదపడతాయన్నారు. ఫోర్స్ మల్టీప్లేయర్స్‌గా డ్రోన్లు, సీసీ కెమెరాలను ఉపయోగించుకోవాలని సూచించారు. చోరీలను అరికట్టడానికి పోలీసు శాఖ రూపొందించిన ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల భాగస్వామ్యంతో రాషా్ట్రన్ని సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తయారు చేస్తామని స్పష్టం చేశారు. మహిళా పోలీసులకు హోంమంత్రి సహా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హెల్మెట్లను అందజేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు విరాళాలిచ్చిన కుదరవెల్లి వెంకట నరసయ్య, కృష్ణమూర్తి, అబ్దుల్ వహద్, తోట రవి, లక్ష్మీనారాయణ, శంకరరెడ్డి, ఎం.వెంకటేశ్వరరావు, కె.వెంకటేశ్వరస్వామిని హోంమంత్రి, డీజీపీ సత్కరించారు. నూతనంగా నియమించిన సురక్ష కమిటీకి వెంకట నరసయ్యను కో-ఆర్డినేటర్‌గా నియమించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరాబు, కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యేలు శ్రీరాం తాతయ్య, గద్దె రామ్మోహన్, వసంత కృష్ణప్రసాద్, బొండా ఉమామహేశ్వరరావు, కొలికపూడి శ్రీనివాసరావు, తంగిరాల సౌమ్య, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.