కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వీరు కర్నూలు జిల్లా మంత్రాలయంలోని సంస్కృత పాఠశాలకు చెందిన వేద విద్యార్థులు. పోలీసుల కథనం మేరకు... మధ్వాచార్యుల ప్రత్యక్ష ప్రథమ శిష్యులైన శ్రీనరహరితీర్థుల ఉత్తరారాధన పూజల కోసం మంత్రాలయం నుంచి 20 వాహనాల్లో వేద విద్యార్థులు, పట్టణ ప్రముఖులు, నాయకులు, మఠం సిబ్బంది కలసి దాదాపు 300 మంది మంగళవారం రాత్రి హంపి వెళ్లారు. ఒక వాహనంలో గురుసార్వభౌమ సంస్కృత పాఠశాల వేద విద్యార్థులు 13మంది ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో రాయచూరు జిల్లా పోతనాల గ్రామం వద్ద యాక్సిల్ రాడ్డు విరగడంతో వాహనం రోడ్డుపై మూడు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో మంత్రాలయానికి చెందిన డ్రైవర్ కంసాలి శివ(20) అక్కడికక్కడే మృతిచెందగా, గుంజెల్లి సుజయీంద్ర (22), బళ్లారికి చెందిన హయవదన(19), కొప్పళకు చెందిన అభిలాష్ (20) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇదే వాహనంలో ప్రయాణిస్తున్న కర్ణాటక, ఏపీ, తెలంగాణకు చెందిన మరో 10 మంది వేద విద్యార్థులు సింధనూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బళ్లారికి చెందిన వేద విద్యార్థి జయసింహ పరిస్థితి విషమంగా ఉండటంతో రాయచూరు ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, సిద్దరామయ్య, రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం సిద్దరామయ్య రూ3లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.