పశ్చిమ గోదావరి జిల్లా, కాళ్ళ మండలంలో అసాధారణ రీతిలో వచ్చిన లింగ నిష్పత్తిలో వ్యత్యాసంపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 20న భీమవరం ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి అధికారులతో నిర్వహించిన సమావేశంలో గణాంకాల నివేదిక ప్రకారం కాళ్ళ మండలంలో లింగ నిష్పత్తిలో 1000 మంది పురుషులకు 804 మంది స్త్రీలు మాత్రమే ఉన్నట్లు అసాధారణ వ్యత్యాసం కనిపించింది. మహిళల సంఖ్య తగ్గడానికి కారణాలు ఏమిటనే దానిపై ఆరా తీస్తున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి 1000 మందికి 993 ఉంది. 2011 ప్రకారం 1000 మందికి 997 ఉన్న నిష్పత్తి 804గా రావడంపై గర్భస్థ పిండ పరీక్షలు జరుగుతున్నాయా? ఆడపిల్లలను వద్దనుకుంటున్నారా? లేదా కాళ్ళ మండలంలో మగ పిల్లల జననాల సంఖ్య అధికంగా ఉందా, ఇతరత్రా కారణాలు ఇందుకు కారణమా.. ఇలా ఎన్నో ప్రశ్నలను అధికారులు చర్చించుకుంటున్నారు. కాళ్ళ పీహెచ్‌సీలో మండల వైద్యాధికారి డా. ఎస్.సునీల్‌కుమార్ బుధవారం వైద్య సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సూచనలు చేశారు. అదేవిధంగా గడిచిన ఏడాదిలో ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ప్రసవాల్లో ఆడ, మగ బిడ్డల సంఖ్యను తెలుసుకున్నారు.