విశాఖ మహా నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా తయారు చేయాలన్న సంకల్పంతో జీవీఎంసీ అధికారులు దృష్టి సారించారు. కమిషనర్ (మూడు రోజుల క్రితం బదిలీ అయ్యారు) ఇటీవల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ప్లాస్టిక్ అమ్మకాలు, వినియోగం జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 120 మైక్రాన్లకన్నా తక్కువ మందం వున్న ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, టీ కప్పుల వినియోగంపై నిషేధం విధించారు. ఇంకా ఆకుపచ్చ రంగు లామినేషన్‌తో వుండే పేపర్ ప్లేట్లు, తెలుపు కాకుండా ఇతర రంగుల్లో వుండే గుడ్డ సంచులను కూడా నిషేధించారు. అనకాపల్లి జోన్ పరిధిలో హోల్‌సేల్ ప్లాస్టిక్ అమ్మకాల దుకాణాలు 12 వరకు ఉన్నాయి. ఈ వ్యాపారులతో జోనల్ కమిషనర్ బీవీ రమణ ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి 120 మైక్రాన్ లోపు మందంగల ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించామని, ఎవరైనా అమ్మకాలు సాగిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అనకాపల్లి పట్టణంలో అన్ని రకాల రిటైల్ దుకాణాలు 2,500 వరకు ఉన్నాయి. జీవీఎంసీ అధికారులు ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆకస్మిక తనికీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 600 దుకాణాల వరకు తనిఖీలు చేశారు. పది కిలోల వరకు ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు సీజ్ చేశారు. ఈ నెలాఖరు వరకు దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తూ, ప్లాస్టిక్ నిషేదంపై అవగాహన కల్పిస్తారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తారు. ప్లాస్టిక్ విక్రయిస్తూ పట్టుబడితే మొదటిసారి రూ.2,500లు, రెండోసారి అయితే రూ.5 వేలు, మూడోసారి రూ.10 వేలు, నాలుగోసారి రూ.20 వేలు, ఐదోసారి రూ.40 వేలు జరిమానా విధిస్తారు. అప్పటికీ ప్లాస్టిక్ అమ్మకాలు సాగిస్తే దుకాణాన్ని సీజ్ చేసి, ట్రేడ్ లైసెన్సును రద్దు చేస్తారు.