టీమిండియాలో చోటు దక్కాలంటే ప్రతి ఒక్క ఆటగాడు రంజీ ట్రోఫీలో పాల్గొనాలని ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిబంధన విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్, గిల్, రవీంద్ర జడేజ, యశస్వి జైష్వాల్ ఇలా చాలామంది ఆటగాళ్లు ప్రస్తుతం రంజీ ట్రోఫీలో బిజీగా ఉన్నారు. అయితే ఈ రంజీ ట్రోఫీలో భాగంగా గురువారం రోజు మొదలైన కేరళ వర్సెస్ మధ్యప్రదేశ్ మ్యాచ్ లో ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ గాయపడ్డాడు. దీంతో భారత జట్టుకే కాకుండా ఐపీఎల్ – 2025 సీజన్ కి ముందు కోల్కత్తా నైట్ రైడర్స్ కి భారీ షాక్ తగిలింది. కోల్కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్, మధ్యప్రదేశ్ కీలక ప్లేయర్ వెంకటేష్ అయ్యర్ రంజీ ట్రోఫీ 2024 – 25 సీజన్ లో భాగంగా గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా కేరళలో జరుగుతున్న మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తుండగా కుడికాళి చీలమండకు గాయం అయింది. తన కుడి కాలి చీలమండ గాయంతో అతడు మైదానాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ వార్త కలకత్తా అభిమానులతో పాటు భారత అభిమానులకు కూడా పెద్ద షాక్ కి గురిచేసింది. వెంకటేష్ అయ్యర్ ని కలకత్తా నైట్ రైడర్స్ ఏకంగా 23.75 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. గత నాలుగు ఐపిఎల్ సీజన్లలో వెంకటేష్ అయ్యర్ కలకత్తా నైట్ రైడర్స్ జట్టులో కీలకపాత్ర పోషించాడు. 2021 లో జట్టు ఫైనల్ కి చేరుకోవడంలో, అలాగే 2024 లో ఆ జట్టు ట్రోఫీని గెలుచుకోవడంలో అతడు ఎంతో కృషి చేశాడు. ఈ గాయం కారణంగా అతడు ఏప్పుడు కోలుకుంటాడనేది ఇప్పుడు ప్రశ్నార్దకంగా మారింది. ఒకవేళ ఈ గాయం తీవ్రత ఎక్కువగా ఉండి అతడు ఐపీఎల్ – 2025 సీజన్ కి దూరం అయితే ఇది కోల్కతా నైట్ రైడర్స్ కి పెద్ద ఆందోళన కలిగించే విషయం అనే చెప్పాలి.