కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో పేద విద్యార్థులు అర్థంతరంగా చదువులకు దూరమవుతున్నారని, కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్నాయని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యారంగాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉందని.. తక్షణమే రూ. 4 వేల కోట్ల బకాయిలు చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించకుంటే విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన నిలబడి వైయస్ఆర్‌సీపీ పోరాడుతుందని హెచ్చరించారు. ఫిబ్రవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లను కలిసి విజ్ఞాపనపత్రాలు సమర్పిస్తామని అప్పిరెడ్డి వెల్లడించారు.