ప్లంజ్‌పూల్ గుంత వల్ల శ్రీశైలం డ్యాం భద్రతకు ముప్పు పొంచి ఉంది.. దీనిపై అధ్యయనం చేసి.. తక్షణ చర్యలు తీసుకోవాలని శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల బృందాలు పలుమార్లు తేల్చి చెప్పాయి. ప్రభుత్వానికి నివేదికలు కూడా ఇచ్చాయి. కానీ ఏళ్లు గడచినా ఆ దిశగా అడుగులు పడడం లేదు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ అధ్యయనం కోసం రూ.14 కోట్లు మంజూరు చేసింది. పుణేకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ సెంటర్ (సీడబ్ల్యూపీఆర్‌సీ)కి నామినేషన్‌పై ఇచ్చేందుకు అనుమతి కోరుతూ ఇంజనీర్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు. మంగళవారం హైదరాబాద్ జలసౌధలో జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. 2009 నాటి భారీ వరదల కారణంగా.. డ్యాం స్పిల్‌వే గేట్ల నుంచి అతివేగంగా కింద పడే ప్రవాహం మళ్లీ ఎగిసిపడే ప్రాంతం (ప్లంజ్‌పూల్)లో భారీ గుంత ఏర్పడింది. ఈ గుంత లోతు 45 మీటర్లు, వెడల్పు 270 మీటర్లు, పొడవు 400 మీటర్లు ఉంటుందని అంచనా వేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక శ్రీశైలం డ్యాంను సీఎం చంద్రబాబు సందర్శించారు.ఆ సమయంలో ప్లంజ్‌పూల్ సమస్యతో పాటు మరమ్మతులపై ప్రాజెక్టు ఇంజనీర్లు ఆయనకు వివరించారు. ఆ తర్వాత ప్లంజ్‌పూల్ గుంత వల్ల ఏ మేరకు ప్రమాదం పొంచి ఉందో అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేసింది. పుణేలోని సీడబ్ల్యూపీఆర్‌సీకి నైపుణ్యం ఉందని.. టెండర్లు లేకుండా నామినేషన్‌పై అధ్యయన బాధ్యతలు అప్పగించేందుకు అనుమతులు సహా తక్షణమే రూ.3.70 కోట్లు మంజూరు చేయాలని కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ ఇంజనీర్లు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. దీనిపై కేఆర్‌ఎంబీ సమావేశంలో చర్చించినప్పుడు.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, తక్షణమే ప్లంజ్‌పూల్‌పై అధ్యయనం చేయించాలని తెలంగాణ అధికారులు కోరినట్లు తెలిసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని బోర్డు సూచించినట్లు సమాచారం.