కస్టమ్స్ (ప్రివెంటివ్), సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్ యాంటీ ఎవేజన్ అధికారులు విజయవాడలో సంయుక్తంగా సోదాలు నిర్వహించి స్మగ్లింగ్ చేయడానికి ఉంచిన రూ.1.76 కోట్ల విలువైన నకిలీ సిగరెట్లను గురువారం స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులోని ఓ గోడౌన్‌లో స్మగ్లింగ్ సిగరెట్లు ఉన్నాయని సమాచారం రావడంతో సోదాలు చేశారు. ఈ గోడౌన్‌లో ప్యారిస్ బ్రాండ్‌కు చెందిన 17.60 లక్షల సిగరెట్లను 88 హై డెన్సిటీ పాలిథిన్ సంచుల్లో ఉంచారు. వీటిని కొంతమంది వ్యాపారులు బిహార్ నుంచి రప్పించినట్టు గుర్తించారు. ఇవన్నీ నకిలీ సిగరెట్లుగా తేల్చారు. ఎలాంటి పన్నులు చెల్లించకుండా, వే బిల్లులు లేకుండా గోడౌన్‌కు తీసుకొచ్చారని అధికారులు గుర్తించారు. ఈ సరకు విలువ రూ.1.76 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఇద్దరిని అరెస్టు చేసి, విశాఖపట్నంలోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా, 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.