విశాఖ జిల్లా భీమిలిలో హనీ ట్రాప్ కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా వాసి రామారావుకు ఈనెల (జనవరి) 18వ తేదీ నుంచి ఓ యువతి ఫోన్ కాల్స్ చేస్తోంది. రామారావు19న పెద్దిపాలెం వెళ్తుండగా ఆ యువతి మరోసారి ఫోన్ చేసింది. సంగివలస మూడుగుళ్ల వద్దకు రావాలని కోరింది. ఆమె చెప్పిన ప్రదేశానికి వచ్చిన వెంటనే గుర్తు తెలియని నలుగురు దుండగులు రామారావును కిడ్నాప్ చేశారు. దాకమర్రిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. రామారావు వద్ద ఉన్న రూ. 48 వేలు, ఏటీఎం కార్డులు దుండగులు తీసుకున్నారు. అయితే రామారావు ఎవరికీ ఈ విషయాన్ని చెప్పలేదు. దీంతో రామారావు ఖాతా నుంచి మరో రూ. 7 వేలు డ్రా చేశారు. దీంతో నగదు మాయంపై బాధితుడు రామారావు భీమిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఇచ్చిన ఆధారాలమేరకు కేసు నమోదు చేసి నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.కాగా మహిళల డీపీలు, వాయిస్‌తో ఫోన్ చేసి హనీ ట్రాప్‌లకు పాల్పడేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, సైబర్ నేరాగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. కొత్తకొత్త మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసుశాఖ రూపొందించిన హనీట్రాప్ షార్ట్ వీడియోను, పోస్టర్‌ను ఆయన శుక్రవారం (జనవరి 17న) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హనీట్రాప్ పేరుతో కొంత మంది వ్యక్తులు ప్రజలను ఏ విధంగా ఉచ్చులోకి దింపుతారో తెలియజేసేందుకు షార్ట్ వీడియోను రూపొందించామన్నారు. డబ్బులు కోసం ఫోన్, వాట్సాప్ సంభాషణ, వీడియో కాల్స్ చేసి ప్రేమ పేరుతోనూ ఉచ్చులోకి దించుతున్నారని, ఆ సంభాషణలను, వీడియోలను మార్ఫింగ్ చేసి ఆశ్లీలంగా మార్చేసి కాంటాక్ట్సులో వున్న ఫోన్ నెంబర్లకు పంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. వీడియోలు, ఫొటోలు వైరల్ చేయకుండా ఉండాలంటే తాము సూచించిన బ్యాంకు ఖాతా నెంబరుకు డబ్బులు పంపాలని కోరతారన్నారు. ట్రాప్‌లో పడ్డాక తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. బెదిరింపులకు పాల్పడే సైబర్ మోసగాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో భయపడవద్దని, ఆలస్యం చేయకుండా స్థానిక పోలీసు స్టేషన్‌లో కాని, సైబర్ క్రైం పోర్టల్‌లో కాని, 1930కి ఫోన్ చేయడం ద్వారా కాని బయటపడాలని కోరారు. ఈ సందర్భంగా షార్ట్ వీడియోలు రూపొందించిన విశాఖకు చెందిన మీడియా ఎఫెక్ట్స్ సభ్యులను, నటించిన హరినీని ఎస్పీ అభినందించారు.