రాష్ట్రానికి పెట్టుబడులను, పారిశ్రామిక సంస్థలను ఆకర్షించడానికి సీఎం చంద్రబాబు మైనస్ డిగ్రీల చలిని కూడా లెక్కచేయకుండా దావోస్ పర్యటనకు వెళ్లారు. వైసీపీ నేత జగన్ మాదిరిగా చలి గురించి సాకులు చెప్పలేదు’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ‘ప్రపంచ ఆర్థిక సంస్థదావోస్ లో నిర్వహిస్తున్న ప్రపంచ స్థాయి సమావేశాలకు ఎందుకు వెళ్లలేదంటే నాటి ముఖ్యమంత్రి చలి అని సాకులు చెప్పారు. ఒకే ఒకసారి వెళ్లి అక్కడ టెంట్లో కూర్చుని పాస్తా తిని తిరిగి వచ్చారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ విరామం లేకుండా అనేక మందితో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి ప్రచారం చేశారు. తాను చేయలేని పని చంద్రబాబు చేస్తున్నారన్న ఉక్రోషంతో జగన్, ఆయన బృందం బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ బురద చల్లడం ఒక్కదానినే నమ్ముకోకుండా వాస్తవాలను గుర్తించే ప్రయత్నం చేస్తే మంచిది’ అని రామయ్య అన్నారు.