పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలోని ఎం.తుమ్మలపల్లె గ్రామంలో ఉన్న యురేనియం పరివాహక గ్రామాల ప్రజలకు నష్టం కలుగకుండా చూడాలని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి బీటెక్ రవి డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్‌ను కోరారు. గురువారం ఆయన వెలగపూడిలో డిప్యూటీ సీఎంను కలిసి ఆయన వినతిపత్రం ఇచ్చా రు. ఆయన మాట్లాడుతూ 2012 నుంచి యురేనియం వారు ఉత్పత్తులు చేస్తున్నారన్నారు. ముడి ఖనిజాన్ని శుద్ది చేసిన తర్వాత వచ్చే వ్యర్థాలను టైలింగ్‌పాండ్‌లో నింపుతున్నారన్నారు. పాండ్ నిర్మాణ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కింది భాగాన బెంటోనైట్ క్లే 50ఎంఎం తిక్‌నె్‌సలో వేయాల్సి ఉండగా క్లే వేయకుండా నిర్మాణాన్ని పూర్తిచేశారన్నారు. దీంతో వ్యర్థాలు భూమిలో ఇంకిపోయి తాగునీరు, వ్యవసాయ బోర్లు కలుషితమవుతు న్నాయన్నా రు. కొట్టాల, కనంపల్లె ప్రజలు వ్యాధులబారిన పడుతున్నారన్నారు. యురేనియం కంటెంట్ 60పీపీబీ మించకుండా ఉండాల్సి ఉంటే ఈ మూడు గ్రామాలలో 400పీపీబీ కంటే ఎక్కువగా ఉందని రుజువైందన్నారు. మబ్బుచింతలపల్లె, తుమ్మలపల్లె, కెకె కట్టాల, రాచకుంటపల్లె, భూమయ్యగారిపల్లె, కనంపల్లెల్లో కలుషిత నీరు, రేడియేషన, కాలుష్యం వలన మహిళలకు గర్భస్రావాలు, క్యాన్సర్ వంటి జబ్బులు, చర్మ వ్యాధులు వస్తున్నాయన్నారు. అలాగే గతం లో కలుషితమై బోర్ల వలన పంట నష్టపోయిన మబ్బుచింతలపల్లె, కొట్టాల గ్రామ రైతులకు యూసీఐఎల్ 78ఎకరాలు పరిహారం ఇచ్చిందన్నారు. ఇపుడు ఆ భూముల తో పాటు కొట్టాల గ్రామాన్ని కూడా యూసీఐఎల్ వారు తీసుకొని పరిహారం, ఉద్యోగం, పునరావాసం కల్పించాలని కోరారు. రాచకుంటపల్లెలో 280 ఎకరాలకు వెంటనే పరిహారం, ఉద్యోగం ఇప్పించాలని కోరారు.