భారతదేశం నేడు 76వ గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) జరుపుకుంటోంది. ఇందుకోసం ముమ్మరంగా దేశవ్యాప్తంగా ఏర్పాట్లు చేశారు. రిపబ్లిక్ డే ప్రధాన ఆకర్షణ ఇందులో జరిగే పరేడ్. ఇక దేశ రాజధాని ఢిల్లీలో జరిగే పరేడ్ లో దేశంలోని సాంస్కృతిక గొప్పతనాన్ని, సైనిక శక్తిని ప్రదర్శించనున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ ఏడాది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్‌కు అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అధ్యక్షత వహిస్తారు. సుసంపన్నమైన సాంస్కృతిక వైవిధ్యం, ఏకత్వం, సమానత్వం, అభివృద్ధి, సైనిక పరాక్రమాల సంబంధించిన సమ్మేళనం అక్కడ కనిపిస్తుంది. కవాతు వీక్షించేందుకు దాదాపు 10,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు.ఇక గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా, ‘గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం గణతంత్ర 75వ అద్భుతమైన సంవత్సరాలను జరుపుకుంటున్నాము. మన రాజ్యాంగాన్ని రూపుదిద్దిన మహనీయులైన మహిళలు, పురుషులకు మన హృదయ పూర్వక నమస్కారాలు. మన ప్రజాస్వామ్యం, గౌరవం, ఐక్యత పునాది మీద సాగుతున్న ఈ మహోన్నత ప్రస్థానాన్ని గుర్తుచేసుకునే సందర్భమిదని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రోజు మన రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు అలాగే మరింత బలమైన, సమృద్ధిగా ఉండే భారతదేశాన్ని నిర్మించేందుకు మనం చేసే ప్రయత్నాలను పెంపొందించనీయాలని ఆయన ఆకాంక్షించారు.