రాష్ట్రంలోని పేద విద్యార్ధులకు వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైయస్ఆర్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్ లో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గమని మండిపడ్డారు. తనకు కావాల్సిన వారికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను దారాదత్తం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.... రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వ వైద్య కాలేజీల ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సేఫ్ క్లోస్ కోసం కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం. 27ని రద్దు చేయాలి. పార్వతీపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం కొన్ని పనుల కోసం పిలిచిన టెండర్లను రద్దు చేయడం దుర్మార్గం. చంద్రబాబు అంటేనే ప్రైవేటీకరణ, కార్పోరేట్ వ్యవస్థలకు దోచిపెట్టే కార్యక్రమంను అమలు చేసే వ్యక్తిగా గుర్తింపు పొందారు. దాదాపు పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని అయినా ఈ రాష్ట్రంలో ప్రారంభించారా? వైయస్ జగన్ గారు అయిదేళ్ళ తన పాలనలో ఏకంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను రాష్ట్రంలో ప్రారంభించేందుకు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. వాటిని కూడా ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబాబు తెగబడటం దారుణం. చంద్రబాబు హయాంలో ఆయనకు సన్నిహితుడైన నారాయణకు, ఎన్ఆర్ఐ, జీఎస్ఆల్ వంటి సంస్థలకు మెడికల్ కాలేజీలను అప్పగించారు. ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఒక్కో సీటుకు కోటిన్నర రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక ఫీజీ సీటుకు దాదాపుగా మూడున్నర కోట్లు వసూలు చేస్తున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్ధులు ఇంత మొత్తం చెల్లించి వైద్యవిద్యను చదవగలరా? అని ప్రశ్నించారు.