ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెనక్కి తగ్గిన కొలంబియా.. అగ్రరాజ్యం విమానాలకు అనుమతి!

international |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2025, 10:01 PM

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అక్రమ వలదారులపై చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. వారందరినీ తిరిగి వారి దేశాలకు పంపించేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. ముఖ్యంగా 500 ప్రత్యేక సైనిక విమానాల ద్వారా అక్రమ వలదారులపను వారి స్వేదేశాలకు చేరుస్తున్నారు. అయితే ఈ చర్యలను కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో వ్యతిరేకించి.. యూఎస్ విమానాలపై నిషేధం విధించారు. దీంతో ట్రంప్ సుంకాలు పెంచుతామంటూ హెచ్చరికలు జారీ చేయగా కొలంబియా వెనక్కి తగ్గింది. దీంతో అమెరికా సైతం.. ఆ దేశంపై విధించిన సుంకాలు, ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు వివరించింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులను 500 ప్రత్యేక సైనిక విమానాల్లో వారి స్వదేశాలకు పంపేందుకు ట్రంప్ సర్కారు చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలువురిని పంపించి వేసింది. ఈ చర్యలపై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా తమ దేశానికి చెందిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ ప్రత్యేక విమానాల ద్వారా పంపకుండా.. పౌర విమానాల ద్వారా మాత్రమే వారిని తమ దేశానికి పంపించాలంటూ కొలంబియా తెలిపింది. అప్పటి వరకు అమెరికా విమానాలపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది.


గౌరవంగా పంపించేలా నిబంధనలు రూపొందిస్తేనే విమానాలను అనుమతిస్తామంటూ ఆ దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో తెలిపారు. ఇప్పటికే కొన్ని సైనిక విమానాలను వెనక్కి పంపినట్లు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలంబియా సర్కారు విమానాలను వెనక్కి పంపడంపై జీర్ణించుకోలేకపోయారు. దీంతో కొలంబియా ఉత్పత్తులపై సుంకాలు 50 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా కొలంబియన్ సర్కారు అధికారుల వీసాలను కూడా వెంటనే రద్దు చేస్తామంటూ వెల్లడించారు. ఇవి కేవలం ప్రారంభ చర్యలు మాత్రమేనంటూ హెచ్చరికలు జారీ చేశారు.


దీంతో కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో వెనక్కి తగ్గారు. అగ్రరాజ్యం అమెరికా పెట్టిన ఆంక్షలు, నిబంధనలకు ఓకే చెప్పారు. అమెరికా సైనిక విమానాలను తమ దేశంలోకి రానిస్తామని.. పౌరులను తమ దేశానికి ఆహ్వానిస్తామని ప్రకటించారు. దీనిపై తాజాగా యూఎస్ స్పందించింది. కొలంబియా వెనక్కి తగ్గడంతో.. ఆ దేశంపై విధించిన సుంకాలు, పలు ఆంక్షలను నిలివి వేస్తున్నట్లు ప్రకటించింది. కేవలం కొలంబియా మాత్రమే కాదు ఏ దేశం తమ పౌరులను వెనక్కి తీసుకోకపోయినా.. ఇలాంటి చర్యలే తీసుకుంటామంటూ వెల్లడించింది. ఈ విషయం అర్థం చేసుకుని అన్ని దేశాలు తమకు సహకరించాలని.. అక్రమ వలసదారులను స్వదేశాలకు రప్పించుకోవాలని వివరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com