ఎన్నికల సమయంలో ప్రజలకు మాట ఇచ్చి..అధికారంలోకి వచ్చిన తరువాత మోసం చేయడం చంద్రబాబు నైజమని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్ సహా భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఒక్క అబద్దం చెప్పడానికి కూడా వైయస్ జగన్ ఒప్పుకోలేదు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబును హామీల అమలు కోసం అడిగితే మొన్నే అధికారంలోకి వచ్చాం అంటున్నారు. మరి మొన్నే అధికారంలోకి వచ్చిన మీరు గ్రీన్ హైడ్రో ప్రాజెక్టు ఎలా తీసుకొచ్చారు?. బల్క్ డ్రగ్ పార్క్ ఎలా తీసుకొచ్చారు?. పథకాల విషయంలో మొన్నే అధికారంలోకి వచ్చాం అంటారా?. ప్రాజెక్టులు మాత్రం మేమే తీసుకొచ్చాం అంటారా?. ఇదెక్కడి న్యాయం’ అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు