ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువ సవరణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 16,997 గ్రామాల్లో భూముల విలువ సవరణ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో భూముల మార్కెట్ విలువ సవరణపై కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు తాజాగా సవరణ చేస్తూ రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ప్రకటన జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 16,997 గ్రామాల్లో 9,054 వార్డుల్లో భూముల విలువ సవరణ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. 68 గ్రామాలకు సంబంధించి ఎలాంటి మార్పులు, చేర్పులు చేయలేదు. 158 గ్రామాలు, 145 వార్డుల్లో భూములు విలువ తగ్గించినట్లు రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ తెలిపింది.అలాగే మార్కెట్ విలువల్లో మార్పులకు సంబంధించి registration.ap.gov.in వెబ్ సైట్‌లో ఇవాళ (శనివారం) ఉదయం 10 గంటల నుంచి వివరాలు అందుబాటులో ఉంటాయని చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా జాయింట్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు ఆధ్వర్యంలోని కమిటీలు ప్రజల నుంచి ఇప్పటికే అభ్యంతరాలు స్వీకరించినట్లు పేర్కొంది. వాటిని పరిగణనలోకి తీసుకుని మార్కెట్ వాల్యూను రివైజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన మార్కెట్ విలువలు అమలులోకి వస్తాయని చెప్పింది.