కొత్తవలస స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద శుక్రవారం గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సీఐ షణ్ముఖరావు అరెస్టు చేశారు. వారి నుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి సీఐ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం మధ్యాహ్నం ఎస్‌ఐ సుదర్శనరావుకు వచ్చిన సమాచారం మేరకు ఆర్టీసీ కాంప్లెక్సుకు సిబ్బంది వెళ్లారన్నారు. ఇద్దరు వ్యక్తులు బ్యాగ్‌లు పట్టుకుని పారిపోవడానికి ప్రయత్నం చేయగా వారిని పట్టుకున్నారన్నారు.
వారి బ్యాగ్‌ల్లో తనిఖీ చేయగా రెండు కేజీలు చొప్పున గంజాయి ఉందన్నారు. వారిని తిరుపతికి చెందిన అరవ ప్రవీణ్, కడపకు చెందిన కావడి మధుసూదన్‌గా గుర్తించా మన్నారు. ఇద్దరూ స్నేహితులని, తిరుపతి నుంచి ఒడిశా రాష్ట్రం పాడువ గ్రామానికి వెళ్లి అక్కడ గుర్తుతెలియని వ్యక్తి వద్ద నుంచి 10 వేల రూపాయలకు నాలుగు కేజీల కొనుగోలు చేసినట్టు తెలిపారన్నారు. అరుకు నుంచి బస్సులో వచ్చి విశాఖ వెళ్లి అక్కడ నుంచి తిరుపతి వెళ్లడానికి ప్రయత్నం చేస్తుండగా పట్టుకున్నామన్నారు. స్థానిక తహసీల్దార్ బి.నీలకంఠరావు సమక్షంంలో గంజాయిని స్వాధీనం చేసుకుని కొత్తవలస కోర్టులో హాజరపర్చినట్టు తెలిపారు.