పింఛన్ పంపిణీ చేసేందుకు మోటార్ సైకిల్‌పై వెళ్తున్న సచివాలయ ఉద్యోగిని అడ్డుకొని సినీ ఫక్కీలో నగదు చోరీ చేసిన ఘటన మండలంలోని బాదాపురం గ్రామ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. అందిన వివరాల మేరకు.. దొనకొండ మండలంలోని చందవరం గ్రామానికి చెందిన వీరంరెడ్డి రంగారెడ్డి మండలంలోని పెద్దన్నపాలెం గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. పంచాయతీ పరిధిలోని 58 మంది పింఛన్‌దారులకు సంబంధించిన రూ.2.68 లక్షల నగదును శుక్రవారం తీసుకొని సాయంత్రం తన స్వగ్రామమైన చందవరానికి వెళ్లారు.
శనివారం తెల్లవారుజామున పింఛన్ నగదు పంపిణీ నిమిత్తం చందవరం నుంచి తన ద్విచక్ర వాహనంపై దొనకొండకు బయల్దేరారు. మార్గమధ్యంలో ముఖం కనబడకుండా కర్చీఫ్‌లు కట్టుకున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెల్ఫేర్ అసిస్టెంట్ రంగారెడ్డిని ద్విచక్ర వాహనంపై వెంబడించారు. బాదాపురం సమీపంలో అనువుగా ఉండటంతో అడ్డగించారు. అతన్ని కిందకు నెట్టేసి నగదు ఉన్న బ్యాగును లాక్కొని ద్విచక్ర వాహనంపై చందవరం వైపు వెళ్లిపోయారు. వెంటనే రంగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రిపురాంతకం సీఐ హస్సాన్ హుటాహుటిన తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని వెల్ఫేర్ అసిస్టెంట్ రంగారెడ్డిని సంఘటన జరిగిన తీరుపై విచారించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒంగోలు నుంచి డాగ్ స్క్వాడ్‌ను పిలిపించి దొంగల ఆనవాళ్ల కోసం పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు.