మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద కలకలం రేగింగి. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు యువకుడు భీభత్సం సృష్టించాడు. ఆదివారం తెల్లవారుజామున గన్నిశెట్టి గంగాధర్ అనే వ్యక్తి తప్పతాగి.. ముద్రగడ ఇంటికి ట్రాక్టర్ నడుపుకుంటూ వచ్చాడు. అక్కడ కాంపౌండ్ వాల్ గేటు ట్రాాక్టర్‌తో ఢీకొట్టి లోపలికి వెళ్లాడు. అనంతరం పార్కింగ్ చేసిన కారుతో పాటు ఫ్లెక్సీలను ఢీకొట్టి ధ్వంసం చేశాడు. జై జనసేన అంటూ అతడు నినాదాలు చేశారు. అనంతరం గేటును ఢీకొట్టాడు. ర్యాంప్ వద్ద ఉన్న కారును ఢీకొట్టడంతో భారీ శబ్దానికి ముద్రగడ ఇంటిలోని ఉండే పనివాళ్లు, వ్యక్తులు మేల్కొనడంతో అతడు అక్కడ నుంచి పరారయ్యాడు. మరోవైపు, దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ముద్రగడ నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించారు. వీటి ఆధారంగా నిందితుడ్ని జగపతి నగరానికి చెందిన యువకుడు గంగాధర్‌గా గుర్తించి.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
కేసు నమోదుచేసిన పోలీసులు.. విచారణ చేస్తున్నారు. అతడి చర్యల వెనుక ఎవరైనా ఉన్నారా?. లేక గంగాధర్ తనకు తానుగా ఇలా చేశాడా? అన్న దానిపై కూడా ఆరా తీస్తున్నారు. తమ నాయకుడి నివాసం వద్ద తాగుబోతు వీరంగం వేసిన విషయం తెలుసుకున్న ముద్రగడ అనుచరులు.. భారీగా చేరుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు ముద్రగడ నివాసానికి వచ్చి.. పరిస్థితి గురించి ఆరా తీశారు.
కాగా, ఇటీవలే ముద్రగడ పద్మనాభం రెడ్డి కుమారుడు ముద్రగడ గిరికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక బాధ్యతల్ని అప్పగించారు.. ఆయనను కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా నియమించారు. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో గిరికి ఈ బాధ్యతలు అప్పగించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.