తెలంగాణలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన ప్రచారం ఆందోళనకు గురిచేసింది. నగరానికి చెందిన వ్యక్తికి పాకిస్థాన్ ఉగ్రవాదులతో లింకులు ఉన్నట్లు ఆరోపణలు రావటంతో.. వరంగల్‌లో కలకలం రేగింది. వరంగల్ జానిపీరీలకు చెందిన జక్రియా అనే వ్యక్తికి పాకిస్థాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు అతన్ని చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జనవరి 25వ తేదీన శ్రీలంకకు వెళ్తుండగా.. జక్రియాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
వరంగల్ శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద నిందితుడు జక్రియా.. బిర్యానీ సెంటర్ నడుపుతున్నాడు. జక్రియాకు కొన్నేళ్లుగా పాకిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. జక్రియా శ్రీలంకకు వెళ్తున్న క్రమంలో.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో నిజంగానే జక్రియాకు పాకిస్థాన్ టెర్రరిస్టులతో సంబంధాలున్నాయా..? జక్రియాతో పాటు ఇలా ఇంకెంత మంది ఉన్నారన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
జక్రియా స్వస్థలం పాకిస్థాన్ అని.. 32 సంవత్సరాల క్రితమే ఇండియాకు వచ్చిన జక్రియా ముందుగా.. ఏపీ ఉన్న గుంటూరులో స్థిరపడ్డారని... 25 సంవత్సరాల క్రితం వరంగల్‌కు వచ్చి జానిపీరీలో స్థిరపడ్డారని కూడా ప్రచారం జరుగుతోంది. కాగా.. వరంగల్‌లోని శివనగర్ అండర్ బ్రిడ్జి దగ్గర.. రాయల్ బావర్చి బిర్యాని పాయింట్ నడిపిస్తున్నారు. అయితే.. జనవరి 25న శ్రీలంకకు వెళ్తుండగా.. మద్రాస్ ఎయిర్ పోర్టులో అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
నిజంగానే జక్రియాకు ఉగ్రవాదులతో సంబంధం ఉందా లేక కేవలం అనుమానమేనా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరోవైపు... వరంగల్లో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయని పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడంతో స్థానికంగా ప్రజలు భయాందళోనలకు గురవుతున్నారు. పోలీసులు కూడా అప్రమత్తమై మరింత నిఘా పెంచారు.
తనకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని జరుగుతోన్న ప్రచారాన్ని జక్రియా ఖండించారు. తనను విచారించిన ఎన్ఐఏ క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు. 2021 మార్చి నుంచి జమాతుల్ ముస్లిమిన్ ఆలిండియా అధ్యక్షుడిగా పని చేస్తున్నాని తెలిపారు. తమ సంఘం అమెరికా, సౌదీ, ఖతర్, పాకిస్థాన్, శ్రీలంక తదితర దేశాల్లో ఉందన్నారు. శ్రీలంక అధ్యక్షుడు షిఫాక్ సాబ్‌ను కలవడానికి వెళ్తుంటే చెన్నై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారణ కోసం తనను ఆపేశారని తెలిపారు. పాస్‌పోర్ట్, ఫోన్ తీసుకొని.. రెండు రోజులపాటు తనను విచారించారన్నారు. జమాతుల్ ముస్లిమిన్ గురించి పూర్తి సమాచారం అడిగి తెలుసుకున్నారని.. తన వివరణతో పూర్తిగా సంతృప్తి చెందిన అధికారులు జనవరి 29న తనకు క్లీన్ చిట్ ఇచ్చి పంపించేశారని జక్రియా తెలిపారు. తాము దూదేకుల కులానికి చెందిన వాడినని.. తాము గుడికి వెళ్తాం, హిందూ పండుగలు కూడా జరుపుకునే వాళ్లమన్నారు.