తిరుపతిలో భారీ చోరీ చోరీ జరిగింది. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సీపీఆర్ విల్లాస్‌లో దొంగలు రెచ్చిపోయారు. వరుసగా నాలుగు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. దాదాపు కేజీన్నర బంగారం ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఘటన వివరాల్లోకి వెళితే.. సిపీఆర్ విల్లాస్‌లో 80,81,82,83 విల్లాలలో గతరాత్రి దొంగతనం జరిగింది. సోలార్ ఫెన్సింగ్‌ను కట్టర్ సాయంతో కట్ చేసి.. ఆపై దొంగలు విల్లాల్లోకి ప్రవేశించారు. విల్లా నెంబర్ 81లో ఓనర్ మేఘనాథ రెడ్డి పై అంతస్తులో నిద్రిస్తుండగా కింద అంతస్తులో కేజీ బంగారం అహరించారు. పక్కనే ఉన్న విల్లా నెంబర్ 82లోకి ప్రవేశించి.. కేశవు లనాయుడు అనే వ్యక్తి ఇంట్లో 48 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశారు.
విల్లా 80, 83 ఇండ్లను గెస్ట్‌హౌస్‌లు యజమానులు వినియోగించుకుంటున్నారు. అక్కడ ఏమీ దొరక్కపోవటంతో దొంగలు ఉత్తి చేతులతో వెళ్లిపోయారు. ఉదయం చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. క్లూస్ టీం సహయంతో ఆధారాలు సేకరించారు. ఇది పాత నేరస్థుల పనేనని పోలీసులు తెలిపారు. దొంగలు సీపీఆర్ విల్లాస్ వెనుక వైపు నుంచి ఫెన్సింగ్ కట్ చేసుకుని లోపలికి ప్రవేశించినట్లు చెబుతున్నారు. ఘటన స్థలంలో దొరికిన క్లూస్ ఆధారంగా విచారణ చేపట్టామని త్వరలోనే దొంగల్ని పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.
తిరుపతి వేదిక్ యూనివర్సిటీలో చిరుత పులి కలకలం ఇక తిరుపతి వేదిక్ యూనివర్సిటీలో మరోసారి చిరుత పులి కనిపించింది. ఇవాళ తెల్లవారుజామున వర్సిటీ వీసీ డ్రైవర్ చిరుత పులిని గుర్తించాడు. రామేశ్వరం బిల్డింగ్ ముందు చిరుత పులి కనిపించగా.. సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. శనివారం కుక్కను వేటాడిన చిరుత దృశ్యాలను సెక్యూరిటీ సిబ్బంది సెల్‌ఫోన్లలో రికార్డు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. మరోసారి చిరుత కనిపించటంతో ఎస్వీ యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీలోని సిబ్బంది, విద్యార్థులు భయబ్రాంతులకు గురవుతున్నారు. క్యాంపస్ ఆవరణలో తిరుగుతున్న చిరుతను బంధించాలని అధికారులను కోరుతున్నారు.